హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబందుల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోంశాఖను తన దగ్గర పెట్టుకొని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రజల పక్షాన అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో పోరాడుతుంటే ఓర్వలేక దమనకాండకు దిగుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 15, 16 తేదీల్లోనే 15 అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. సైబర్ నేరస్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు కేసీఆర్ ఏర్పాటుచేసిన సైబర్ సెక్యూరిటీని సీఎం తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఐటీ యాక్ట్‌కు విరుద్ధంగా ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయని, రీ ట్వీట్ చేసినా, వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నా వదలడంలేదని తెలిపారు. గొర్రెల స్కాంలో కొడంగల్‌కు చెందిన ఓ అధికారిని అకారణంగా జైల్లో పెట్టిన పోలీసులు.. హరీశ్‌రావుపై పెట్రోల్ పోసి చంపుతానన్న కాంగ్రెస్ నేతపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్, బమ్మెర రామ్మూర్తి, అభిలాష్ రంగినేని, సైదులుతో కలిసి ప్రవీణ్ విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్‌గాంధీ, రాజ్యాంగ పరిహాసానికి పాల్పడుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఆఫీసులపై సైబర్ పెట్రోలింగ్ చేయాలి..
‘సైబర్ సెక్యూరిటీ అధికారులు కొందరు రేవంత్‌కు తొత్తులుగా వ్యవహరిస్తూ గాంధీభవన్‌లో తయారైన స్క్రిప్ట్‌ల ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. సైబర్ పెట్రోలింగ్ పేరిట తెలంగాణ భవన్‌పై దృష్టి పెట్టారు. గౌతమ్, కొణతం దీలిప్, క్రిశాంక్ పెట్టే పోస్టుల్లో ఎలాంటి అసభ్యత లేకున్నా అకారణంగా కేసులు పెట్టారు. ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించిన జర్నలిస్టు రేవతిపై వ్యవస్థీకృత నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.. కేసీఆర్, కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ ముఖ్యనాయకులపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలను విస్మరిస్తున్నారు’ అంటూ ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సైబర్ సెక్యూరిటీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ, కాంగ్రెస్ ఆఫీసులతోపాటు ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట వేధిస్తున్న రేవంత్ బ్రదర్స్‌పై, అవినితీ అక్రమాలకు నిలయంగా మారిన సెక్రటేరియట్‌పై సైబర్ పెట్రోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
లీకేజీ వ్యవహారంలో కేటీఆర్‌పై మూడు కేసులా?
నకిరేకల్ స్కూల్లో ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కేటీఆర్‌పై మూడు కేసులు ఏవిధంగా పెడతారు? కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఒకే కేసులో రెండు, మూడు ఎఫ్ఐఆర్లు రాయడమెందుకు? అంటూ ప్రవీణ్ సూటిగా ప్రశ్నించారు. పోలీసులు రేవంత్‌కు భయపడకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. మంచిగా పనిచేసిన అధికారులకు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మెడల్స్ అందిస్తామని చెప్పారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వాళ్లు రిటైర్డ్ అయినా శిక్ష తప్పదని, కుటుంబసభ్యులు కూడా తప్పు చేసే ఆఫీసర్లను సరిచేయాలని సూచించారు.
రేవంత్ మెప్పు కోసమే బల్మూరి అడ్డగోలు వ్యాఖ్యలు: గెల్లు
సీఎం రేవంత్ మెప్పు కోసమే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీసీల హక్కుల కోసం పోరాడుతున్న కవితపై అడ్డగోలుగా మాట్లాడారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు. మండలిలో అప్పులపై రేవంత్ చెప్పిన లెక్కలు తప్పని ఎత్తిచూపడం, బీసీ బిల్లులో లోపాలను సవరించాలని కోరడమే ఆమె చేసిన తప్పులా? అని ప్రశ్నించారు. వెంకట్ వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అన్ని పాత్రల్లో రేవంతే
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ సందర్భంలో బాధితుడిలా మరో సందర్భంలో నిందితుడిలా ఇంకోసారి ఇన్వెస్టిగేటర్లా, మరోసారి జడ్జిలా వ్యవహరిస్తున్నారని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ‘జైల్లో తనను ఘోరంగా చూశారని అసెంబ్లీలో చెప్పారు.. బాగా చూసుకున్నారని, సహ ఖైది నాగయ్యే తనకు అన్నం వండిపెట్టేవారని మరో సందర్భంలో ఓ చానల్ అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అదే సందర్భంలో నాగయ్యను వాడు, వీడు అంటూ తన ఫ్యూడల్ మనస్తత్వతాన్ని చాటుకున్నారని విమర్శించారు.