హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది.. వారంలోనే నలుగురిపై హత్యాచారాలు జరగడమే ఇందుకు నిదర్శనం’ అని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగి శాంతిభద్రతలు అదుపు తప్పుతుంటే హాంమంత్రిత్వ శాఖను తన వద్దే అట్టి పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. కనీసం సమీక్ష చేయకపోడం, బాధితులను పరామర్శించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలు, విద్యార్థులపై కేసులు పెట్టడంలో బిజీగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ నేతలు అభిలాష్, అరుణ, తుంగ బాలు, చిరుమల్ల రాకేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
మహిళలపై రోజుకో చోట దాష్టీకాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అఘాయిత్యాలను నిరోధించడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. మేడ్చల్‌లో ఎంఎంటీఎస్‌లో ఓ యువతిపై లైంగికదాడికి దుండగులు యత్నించారని, సంగారెడ్డి జిల్లా కందిలో మద్యం మత్తులో ఉన్న దుండగులు భర్తను కట్టేసి వివాహితపై లైంగికదాడి చేశారని, నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ గుడి సమీపంలో ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారని, మార్చి 31న పహాడీషరీఫ్‌లో జర్మనీ యువతిపై లైంగికదాడి జరిగిందని వివరించారు. ప్రతిరోజూ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, రాజకీయ చర్చలు జరుపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి అతివలపై జరుగుతున్న హత్యాచారాలపై ఒక్కసారి కూడా సమీక్షించలేదని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో ప్రత్యేక చర్యలు
కేసీఆర్ పాలనలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. 331 షీటీం బృందాలు, 11 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు పోలీసులకు రూ.700 కోట్లతో అధునాతన వాహనాలను సమకూర్చారని, దిశ ఘటనలో నిందితులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో పోలీస్ వ్యవస్థను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. డయల్ 100కు కాల్చేసినా స్పందన కరువైందని చెప్పారు. పోలీసులంటేనే సమాజంలో నమ్మకం పోతున్నదని తెలిపారు. నేరస్థులను వదిలిపెడుతున్న పోలీసులు.. ప్రశ్నిస్తున్న మన్నె క్రిశాంక్, దిలీప్ కొణతం తదితర బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించడంలో ముందుంటున్నారని నిప్పులు చెరిగారు. హెచ్‌సీయూలో 400 ఎకరాలను కాపాడేందుకు ఉద్యమిస్తున్న విద్యార్థులపై లాఠీలు ఝులిపించడంలో మాత్రం ఎనలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజూ మహిళలపై దాడులు జరుగుతుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.