హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ‘కీకారణ్యంలో కూంబింగ్ చేయడమంటే గచ్చిబౌలి గ్రేహౌండ్స్ భూములను లాక్కున్నంత తేలిక కాదు సీఎం గారూ. ఇల్లు దాటి బయటకెళ్తే మేము తిరిగి క్షేమంగా వస్తామో? లేదో? తెలియని పరిస్థితులు నాడు ఉండేవి. మండే ఎండల్లో, నీళ్లు దొరకని దట్టమైన అడవుల్లో మా ప్రాణాలను నిలుపుకోవడానికి ఎవరి మూత్రాన్ని వాళ్లే తాగి బతికిన రోజులున్నాయి’ అని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు.
తన భద్రత, ఇతర అంశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ వ్యవహర్తిన్న తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భద్రతను ఉపసంహరించుకోవాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బుధవారం ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తిరిగి కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన సర్వీస్ కాలంలో ఎదురొన్న అత్యంత కఠినమైన పరిస్థితులను ఆయన గుర్తుచేసుకొన్నారు.
‘భారీ వర్షం పడుతున్నప్పుడు గొడుగు కావాలనుకుంటాం. అదే వర్షం తగ్గి ఎండరాగానే, ఆ గొడుగునే ఒక భారంగా భావిస్తాం. సీఎంకు, డీజీపీకి మాజీ, రిటైర్డ్ పోలీస్ అధికారులం ఎండలో గొడుగుల్లా కనిపిస్తున్నాం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. నాటి రోజుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన పోలీసుల దుస్థితిని అర్థం చేసుకొన్నందుకు తెలంగాణ హైకోర్టుకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేవలం తనపై ఉన్న వ్యక్తిగత కక్షతో వందలాది మంది పోలీస్అధికారుల ప్రాణాలను పణంగా పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, ర్యాలీలు, విలాసాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, వాటితో పోలిస్తే దేశరక్షణ కోసం పోరాడిన తమలాంటి అధికారుల భద్రతఖర్చెంత? అని ప్రశ్నించారు.
బలిమెలలో 40 మంది కమాండోలు వీరమరణం పొందిన రోజున.. నాటి ముఖ్యమంత్రులు కనీసం వారి కుటుంబాలను పరామర్శించడానికి కూడా రాలేక, తమను పంపించారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. పోలీస్ అధికారిగా తాను విలాసాలకు దూరంగా ఉన్నానని, రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం, నక్సల్స్‌తో చర్చలు జరుపడానికి రాత్రనకా, పగలనకా దండకారణ్యంలో తిరిగామని తెలిపారు. ఇలాంటి కఠినమైన విధుల వల్ల తమ జీతం ఒకపైసా పెరుగలేదని, గజం భూమి కూడా ఎవరూ ఇవ్వలేదని తెలిపారు.
తమ పిటిషన్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో ప్రభుత్వ లాయర్లు వాదించే తీరు చూస్తుంటే, తమపై ప్రభుత్వానికి ఎంత అసహ్యం, వివక్ష ఉన్నదో స్పష్టమవుతున్నదని ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం కావడం మన రాష్ట్ర దురదృష్టమని పేర్కొన్నారు. 30 ఏండ్ల క్రితమే ఈ విషయం తనకు తెలిసి ఉంటే, తాను అసలు ఐపీఎస్‌లోనే చేరి ఉండేవాడిని కాదేమోనని అసంతృప్తి వ్యక్తంచేశారు. తమకు ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.