నాగర్‌కర్నూల్ : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 15 జిల్లాలుగా పునర్విభజన చేస్తే(Redistribution of Districts) రాష్ట్రం అగ్నిగుండం మారుతుందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ పాలనలో 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్విభజనచేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని 15 జిల్లాలను కుదించే అవకాశం ఉందన్నారు.
కొత్త జిల్లాల కేంద్రంగా పాలన సవ్యంగా సాగుతున్నదని, మళ్లీ జిల్లాల సంఖ్యను కుదిస్తే కొత్త సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. నాలుగు జిల్లాలుగా ఉన్న ఉమ్మడి పాలమూరును రెండు జిల్లాలుగా మార్చే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే జోగులాంబ గద్వాలను మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తిని నాగర్ కర్నూలు జిల్లాలో కలిపి అవకాశం ఉందన్నారు. జిల్లాల మార్పుకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తామన్నారు.
ప్రాంతేతరుడైన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని ఓడించాలని ప్రజలను కోరారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినా ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఆయన సోదరుడు ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఎలాగైనా గెలిపించుకోవాలని ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా పంచే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మల్లురవిని గెలిపిస్తే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు నోట్ల కట్టలు తీసుకుపోయే వ్యక్తిగా మిగులుతాడు తప్పా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడని తెలిపారు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన తాను, గురుకులాల కార్యదర్శిగా పేద బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం కృషిచేసి, వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దానన్నారు. స్థానికుడైన తనకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీజేపీ మతాల మధ్య విద్వేషాలు రగిలిస్తుందన్నారు. ఇంటింటికి అయోధ్య రామాలయం అక్షింతలు పంపుతూ హిందూ ధర్మాన్ని తామే రక్షిస్తున్నామనట్లు ప్రకటనలు చేస్తున్నారన్నారని విమర్శించారు. అయోధ్య రామ మందిరం కంటే ముందే దేశంలో కోట్లాది రామ మందిరాలు ఉన్నాయని అన్నారు. కేంద్రంలో 400 ఎంపీ స్థానాలతో అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని రద్దుచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లను తొలగిస్తుందని హెచ్చరించారు. కర్ణాటక సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అనేక మంది అమ్మాయిలను వేధించి, అత్యాచారాలకు పాల్పడిన రేపిస్టుకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చి, సాక్షాత్తు నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.
కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తానన్నా హామీ నెరవేరలేదన్నారు. రైతుబంధు, రైతు కూలీలకు రూపాయలు 12,000 హామీ అటకెక్కిందన్నారు. వరికి రూ.500 బోనస్ ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల తరుపున పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీచేసిన జీవో.నెం.46 ను సవరించాలని అన్నారు.