కాగజ్‌నగర్, అక్టోబర్ 4 : మోసగాళ్లను ఓడించి.. మళ్లీ కేసీఆర్‌ను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం లైన్‌గూడ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు గుస్సాడీ నృత్యం.. డప్పుచప్పుళ్లతో స్థానికులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక నియోజకవర్గానికే మంత్రి కాదని గమనించాలని సూచించారు. కోట్లాది రూపాయలతో ములుగులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సీతక, సిర్పూర్ నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి పెళ్లిళ్లకు కూడా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారని, ఆదివాసీ ప్రజలకు మాత్రం కనీసం రోడ్లు వేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఆదివాసీల సమస్యలు పరిషరించకపోతే మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు సమస్యలపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. అంబులెన్స్ కూడా వెళ్లలేని గ్రామా లు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మె ల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు స్థానిక సమస్యలపై కనీస అవగాహన లేదని విమర్శించారు. నవేగాం, నాయకన్‌గూడెంకు మిషన్ భగీరథ నీరు రావడంలేదని గ్రామస్థులు తెలపడంతో.. అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. తిరిగి కేసీఆర్ సీఎం అయితేనే సమస్యలు తీరుతాయని స్పష్టంచేశారు.