RS Praveen Kumar | బాబాసాహెబ్ డా.బిఆర్ అంబేద్కర్ సాక్షిగా.. తెలంగాణ అమరవీరుల సాక్షిగా.. తెలంగాణలో రైతాంగాన్ని రక్షించుకుంటామని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అమ్మాయిల పై జరిగే అఘాయిత్యాలను అడ్డుకుంటామని అన్నారు. చదువుకునే పిల్లల పసిప్రాణాలను కాపాడుకుంటామన్నారు. రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను పోరాడి సాధించుకుంటామన్నారు. అక్రమార్కుల చేతిలో అన్యక్రాంతమవుతున్న పేదల భూములను రక్షించుకుంటామని చెప్పారు. తెలంగాణ సహజ వనరులను సంరక్షించుకుంటాం.. తెలంగాణలో తిరిగి కేసీఆర్ పాలన తెచ్చుకుంటామని చెప్పారు.
మా శ్వాస తెలంగాణ.. మా వాదం అభివృద్ధి.. మా లక్ష్యం ప్రజాసంక్షేమం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దయచేసి ఈ రోజు ఈ కింది ప్రతిజ్ఞను మీరు చేయండి. పది మందితో చేయించండి అని పిలుపునిచ్చారు.
సుసంపన్నమైన ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను.
కేసీఆర్ గారి నాయకత్వంలో, ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ.. దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి, సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింది.
కానీ నేడు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ముప్పు వాటిల్లుతున్నది.
ఈ విపత్కర పరిస్థితుల్లో, తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ.. మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా.. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా.. అమరవీరుల సాక్షిగా.. గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిద్దాం.. మన తెలంగాణను రక్షించుకుందాం.. అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని.. మనసా, వాచా, కర్మణా తెలంగాణ సైనికుడిగా ప్రతిజ్ఞ చేస్తున్నా..
జై హింద్! జై తెలంగాణ! జై కేసీఆర్!