హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : గురుకులాలకు ఇప్పటికీ యూనిఫాంలు, రగ్గులు, షూలు, స్పోర్ట్స్ డ్రెస్సులు అందలేదని, జైల్లో ఒక్కో ఖైదీ ఆహారానికి రోజుకు రూ.83 చెల్లిస్తుంటే, గురుకుల విద్యార్థికి మాత్రం రోజుకు రూ.37 మాత్రమే చెల్లిస్తున్నారని బీఆర్ఎస్ నేత అర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా గురుకులాలకు వెంటనే డైట్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేత అభిలాషరావుతో కలిసి తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొమ్మిది నెలలుగా విద్యాశాఖకు మంత్రి లేడని, ఆ శాఖ సీఎం వద్దే ఉన్నా ఎప్పుడైనా సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,900 కోట్లు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజులు కట్టకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు మెమోలు ఇవ్వడం లేదని, రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సంవత్సరంతో కలిపితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8350 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
రూ.5 లక్షలతో ‘విద్యార్థి భరోసా’ అమలు చేస్తామని చెప్పారనీ, ఇప్పటికీ అతీగతీ లేదని దుయ్యబట్టారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన వారికి పాఠశాల స్థాయిలో ఇస్తామన్న రూ.10 వేలు ఏవని? రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, విద్యార్థులు, యువత, రైతులు, మహిళలందరిపై ప్రతీకారపాలన కొనసాగుతున్నదని విమర్శించారు.
పాఠశాలల్లో అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలనే నిర్ణయాన్ని, బ్రహ్మకుమారీస్తో బోధించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో ధార్మిక సంస్థల నియామకం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పనిచేస్తున్న అధ్యాపకులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవని, స్పోర్ట్స్ అకాడమీలో పనిచేస్తున్న వారికీ వేతనాలు రావడంలేదని తెలిపారు. సీఎం అమెరికా టూర్ మనీలాండరింగ్లా ఉన్నదని ఆరోపించారు. లండన్కుపోతే థేమ్స్ నది ఒక్కటే కాకుండా అక్కడ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాలున్నాయని, వాటిని ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.