సిద్దిపేట,జనవరి 31: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసుల విషయంలో ఎర్రవెల్లిలో కాకుండా నందినగర్ నివాసంలో గోడకు ఎట్ల అతికిస్తారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేట.. నా అడ్రస్ సిర్పూర్ కాగజ్‌నగర్ అని ఉంటే మాకెందుకు హైదరాబాద్‌లో ఇచ్చారని సిట్ అధికారులను ఆయన నిలదీశారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. అసలు సమస్యలను పకదారి పట్టించి ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా రేవంత్ పెట్టుకున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వంలోని మంత్రులు అలీబాబా 40దొంగలు, దండుపాళ్యం ముఠా తరహాలో అనేక కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు సామ్, 9 వేల ఎకరాల భూసామ్, లిక్కర్ సీసాల స్కామ్, గురుకుల విద్యార్థుల మరణాలు.. ఇలా అనేక అంశాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే, ప్రభుత్వం గొంతు నొక్కుతున్నదని విమర్శించారు. రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదని, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం పోలీసు శాఖ సమాచారం సేకరిస్తుందని తెలిపారు. ఏ సీఎం కూడా ట్యాపింగ్ చేయమని చెప్పరని, నిఘావర్గాలు, పోలీసుల నుంచి శాంతిభద్రతల కోణంలో సమాచారం మాత్రమే తీసుకుంటారని తెలిపారు.
ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారని, విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత ప్రతిష్టను హననం చేసేలా మీడియాకు లీకులు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కేసీఆర్‌ను వేధించడమంటే, తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో విచారణ చేయాలని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని, అయినా నందినగర్‌లో విచారణ చేస్తామని నోటీసులు ఇంటి గోడకు ఎలా అతికిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ కుట్రపూరిత రాజకీయం ఆపాలని, లేదంటే ప్రజాక్షేత్రంలో రేవంత్‌రెడ్డికి శిక్ష తప్పదన్నారు.