సిద్దిపేట అర్బన్, జూలై 27: వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు సాగుచేయాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడటం లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో సాధారణంగా 256 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సింది ఉండగా కేవలం 176 మి.మీటర్లు మాత్రమే పడిందన్నారు. జిల్లాలోని హుస్నాబాద్, వర్గల్, ములుగు మండలాల్లో తీవ్ర వర్షాభావం, మిగతా మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందన్నారు.
ఆరుతడి పంటలు పండించుకునే విధంగా రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ నెల 31వతేదీ వరకు మొక్కజొన్న, పెసలు, మినుములు, అలసందలు, వేరుశనగ మొదలగు పంటలు వేసుకోవచ్చన్నారు. రాగులు, కందులు, పొద్దుతిరుగుడు, మిల్లెట్స్, కొర్రలు, అరికెలు, ఆముదం తదితర పంటలను ఆగస్టు 30 వరకు సాగుచేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి మల్లయ్య, జిల్లా ఉద్యాన అధికారి సువర్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ, సర్పచ్ చింతల శ్రీనివాస్, వివిధ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.