గంగాధర, జూలై 27 : తమ గ్రామాన్ని పూర్తి ముంపుగా ప్రకటించాలని కోరుతూ గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. సోమవారం మధురానగర్ చౌరాస్తాలో కరీంనగర్-జగిత్యాల రహదారిపై ధర్నా చేపట్టారు. దాదాపు గంటసేపు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా చొప్పదండి నియోజకవర్గంతోపాటు వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మించారని గుర్తు చేశారు. అయితే, రిజర్వాయర్ను నీటితో నింపిన ప్రతిసారీ కట్ట ప్రమాదకరంగా మారి తాము బిక్కుబిక్కుమని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య గురించి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిపల్లి సత్యంకు విన్నవిస్తే తాను గెలిచిన వంద రోజుల్లోనే నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
అయితే ఇప్పుడు ఆ మాటే మరిచిపోయారని మండిపడ్డారు. రిజర్వాయర్లో నీటి నిలువ ఉన్నన్ని రోజులు జాలువారుతూ గ్రామం మొత్తం బురదమయంగా మారుతుందని వాపోయారు. కాగా, కట్ట ఎత్తును పెంచడానికి రిజర్వాయర్ సమీపంలోని ఇండ్ల స్థలాలను తీసుకొని పరిహారం చెల్లించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, మొత్తం గ్రామాన్ని ముంపుగా తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనిపై నాలుగు నెలల క్రితమే ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందించామని, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో, రూరల్ ఏసీపీ నారాయణపూర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయగా, గ్రామాన్ని మొత్తం తీసుకోవాలని కోరినట్టు గుర్తు చేశారు. ఆ మేరకు కలెక్టర్కు నివేదిక అందిస్తామని తెలిపిన అధికారులు విషయాన్ని మళ్లీ మొదటికి తెచ్చారని మండిప్డడారు. కొద్ది రోజులుగా దొడ్డి దారిన ఇండ్లకు మార్కింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఇండ్లకు మాత్రమే పరిహారం ఇవ్వడానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసులు అంటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరు మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించి, తమకు న్యాయం చేయాలని కోరారు. ఆందోళనతో ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించి పోగా, పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.