కరీంనగర్ కార్పొరేషన్/ కలెక్టరేట్, జూలై 27: సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పోరుబాట పట్టారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఉద్యోగ, ఉపాధ్యాయులను ఏకం చేయడంతోపాటు 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేను కలిసి విన్నవించేందుకు జన జాగరణ యాత్ర చేపట్టారు. జూలై 11న ప్రారంభించిన ఈ యాత్ర 17వ రోజు సోమవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుటకు చేరుకున్నది. టీఎస్సీపీఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్వల శ్రీకాంత్‌కు జిల్లా అధ్యక్షుడు నిసార్ అహ్మద్‌తోపాటు నాయకులు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడే కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షల 60 వేల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఏకైక ఆకాంక్ష పాత పెన్షన్ పునరుద్ధరణేనని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోవడం బాధాకరమన్నారు.
సీపీఎస్ విధానం వల్ల రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కేవలం రూ.3 వేల నుంచి 4 వేలు మాత్రమే పెన్షన్ వస్తున్నదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అనంతరం ప్రధానకార్యదర్శి కల్వల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆగస్టు 23న చేపట్టిన చలో హైదరాబాద్‌కు సీపీఎస్ ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత సంఘ ప్రతినిధులు ర్యాలీగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్‌కు వెళ్లి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. దీంతో గంగుల స్పందించి, సీపీఎస్ ఉద్యోగుల పక్షాన ఆగస్టులో జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గళం ఎత్తుతానని, ఉద్యోగుల సమస్యల పరిషారం కోసం ప్రభుత్వంతో పోరాడుతామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నాయకులు, సంఘ నాయకులు మల్లిఖార్జున్, గడ్డం వెంకటేశ్, చంద్రకాంత్, మహాదేవ్, గోనె శిరామ్, మహిళా అధ్యక్షురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.