పెద్దపల్లి, జూన్ 23: దేశంలోనే హోంమంత్రి లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పుతున్నాయని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో హత్యకు గురైన చిన్నారికి నివాళులర్పిస్తూ పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్యచేయడం బాధాకరమని అన్నారు. చిన్నారి హత్యపై హోంశాఖను అట్టిపెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇంతవరకు స్పందించపోవడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ పాలనలో పోలీస్ వ్యవస్థను పటిష్టపరిస్తే.. రేవంత్ సర్కార్ చిన్నాభిన్నం చేసిందని దుయ్యబట్టారు. ఇటీవల భూపాల్పల్లి జిల్లా మహాదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై రివ్వాలర్ చూపి లైంగికంగా వేధించడం, సుల్తానాబాద్ మండలంలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. చిన్నారి హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఊరి శిక్ష వేయాలని కోరారు.