హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర పన్ని కేసీఆర్‌పై సిట్ విచారణ చేయిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందునే విచారణ పేరిట బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. నెరవేరని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్టపగలే దోపిడీ చేస్తున్నదని మండిపడ్డారు. తమ పాల నా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరిట డ్రామా లు ఆడుతున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు. బ్రిటిష్ కాలంలో ట్యాపింగ్ చట్టబద్ధమని ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885 తీసుకొచ్చారని తెలిపారు. దేశ భద్రత, మనీ లాండరింగ్, పన్నుల ఎగువేత నిరోధం, తీవ్రవాద, ఉగ్రవాద దాడులను ఆపడం, ప్రముఖుల ప్రాణాలు రక్షించ డం కోసం ట్యాపింగ్ చేయొచ్చని సెక్షన్-5 చెప్తున్నదని వివరించారు. ఇదే విషయంలో రకరకాల మార్గదర్శకాలను ఆయా ప్రభుత్వా లు నిఘా సంస్థలకు ఇచ్చినట్టు స్పష్టంచేశారు.
యూపీఏ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా ట్యాపింగ్ చట్టబద్ధమని, తాము 9వేల ఫోన్లు ట్యాపింగ్ చేశామని చెప్పారని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలకు చట్టాలు చదివే పరిజ్ఞానం లేదని, వారి ధ్యాసంతా 20% కమీషన్ల మీదనే ఉంటుందని ఆరోపించారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ విచారణ నడుస్తుంటే, గాంధీభవన్ లో కూర్చొని కాంగ్రెస్ నేతలు రన్నింగ్ కామెంటరీ చేయడం ఏమిటని మండిపడ్డారు.
పోలీసులు మాత్రమే చేసే ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకీడ్చి దేశ భద్రతను కాంగ్రెస్ నేతలు ప్రమాదంలో పడేశారని పేర్కొన్నారు. ఓవైపు విచారణ జరుగుతుంటే, బయటకు లీకులిచ్చి వ్యక్తిత్వ హననానికి కాం గ్రెస్ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డా రు. 2015లో ‘ఓటుకు నోటు కేసు’లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్‌రెడ్డి జైలుకెళ్లారని.. తనలాగే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్లాలని కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు.
రాష్ర్టాన్ని పదేండ్లపాటు ప్రగతిపథంలో నడిపిన కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి లేదని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నా రు. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి లో పెద్దఎత్తున కుంభకోణం జరిగినా, మేడిగడ్డను బాంబులతో కూల్చివేసినా దానిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఓ మీడియా సంస్థ కథనం ప్రచురిస్తే దానిపై ఎలాంటి విచారణ లేదని మండిపడ్డారు. కేసీఆర్ చట్టాలను గౌరవించే వ్యక్తి అని, ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని తెలిపారు.