హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ గురుకులాల్లో నెలకొంటున్న సమస్యలన్నింటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. బడుగులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే గురుకులాలను భ్రష్టుపట్టిస్తున్నది. ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలే అందుకు నిదర్శం’ అని బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ గురుకుల సొసైటీల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటర్నేషనల్ గురుకులాలను ఏర్పాటు చేయడం కాదు.. ప్రస్తుత గురుకులాలను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. మరింత మెరుగైన వసతులు కల్పించడంతోపాటు శాస్త్రీయమైన పనివేళలను ప్రవేశపెట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కుట్రలపై బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కులసంఘాలు, విద్యార్థి సంఘాలు తక్షణం స్పందించాలని శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిలుపునిచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.
తెలంగాణ గురుకులాల ప్రత్యేకత ఏమిటి?
ఇవి రాత్రికి రాత్రి పుట్టినవి కావు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలోనే పురుడుపోసుకున్నవి. కేసీఆర్ వాటిని మరోమెట్టుకి తీసుకెళ్లారు. దేశానికే ఆదర్శ నమూనాగా నిలిపారు. సొసైటీ సెక్రటరీలందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకు ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలోని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) సాధించిన విజయాలే సాక్ష్యం. గురుకులాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను అనేక రకాలుగా వడబోసి ఈ సీవోఈల్లోకి ఎంపిక చేస్తారు. ఇంటర్ విద్యతోపాటు నీట్, జేఈఈ కోచింగ్ ఇస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీవోఈల్లోని పేదపిల్లలకు ప్రత్యేక కోచింగ్ ఇప్పించింది. మైక్రో షెడ్యూల్‌ను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా సబ్జెక్ట్ అసోసియేట్లను నియమించి రెండేండ్లపాటు ఆయా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ను క్రాక్ చేసేందుకు కావాల్సిన మెళకువలపై తర్ఫీదు ఇచ్చింది. ఇది విజయవంతమైన ప్రయోగం. సీవోఈల నుంచి దాదాపు మూడు వేల మందికిపైగా విద్యార్థులకు నీట్, జేఈఈ ర్యాంకులు సాధించారు. ప్రతిష్ఠాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో చేరి డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా ఎదిగారు. నీట్ కోసం ఆపరేషన్ బ్లూ క్రిస్టర్, ఆపరేషన్ ఎమరాల్డ్ ఇట్లా అనేక ప్రయోగాలను నిర్వహించాం. కేసీఆర్ ఆ స్వేచ్ఛ ఇచ్చారు. విద్యార్థుల కోచింగ్‌కు నిధుల కొరత లేకుండా చూశారు. ఫలితంగానే దేశంలో ఏ గురుకుల సొసైటీకీ సాధ్యం కాని విజయాలు తెలంగాణ గురుకుల సొసైటీలకు సొంతమయ్యాయి.
కాంగ్రెస్ విధానాలు ఎలా ఉన్నాయి?
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని బాహాటంగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆచరణలో చేసి చూపుతున్నారు. గురుకులాలపై కేసీఆర్ ముద్రను చెరిపేయాలనే కక్షతో బడుగు, బలహీనవర్గాల పిల్లలకు ఉన్నతవిద్యను దూరం చేసే కుట్రకు తెరలేపారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని చాలా గురుకులాల్లో టీచర్లే లేరంటే రేవంత్‌రెడ్డి పర్యవేక్షణ ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సీవోఈల్లో గతంలోనూ రెగ్యులర్ స్టాఫ్ ఉండేది. వారితో ప్రయోగాలు చేశాం. ఫలితాలు రాకపోవడంతో వారితోపాటు సబ్జెక్టు అసోసియేట్లను ఏర్పాటుచేశాం. ఎంట్రన్స్ కోచింగ్ ఇప్పించాం. ఆ సబ్జెక్ట్ అసోసియేట్లను తొలగించడమంటే గురుకులాలను నిర్వీర్యం చేయడమే. ప్రభుత్వ పెద్దల అండ, ప్రోత్సాహం లేకుండా విద్యార్థుల భవిష్యత్‌ను విఘాతపరిచే ఇలాంటి నిర్ణయాలను అధికారులు ఎలా తీసుకుంటారు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గురుకుల విద్యావ్యవస్థపై అవగాహన లేదు.
పనివేళల మార్పుపై మీ అభిప్రాయం?
గురుకులాల పనివేళలను మార్చడం పూర్తిగా ఆశాస్త్రీయం. ఉపాధ్యాయుడు ఎంత ప్రశాంతంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటే తరగతి గదిలో విద్యార్థికి అంత ప్రేరణగా నిలుస్తాడు. ఇష్టంగా పాఠాలు చెప్పి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. ఇప్పుడు మార్చిన పనివేళలతో గురుకులాల్లో ఆ ఆహ్లాదకర వాతావరణమే మారిపోయింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండాలంటే ఉపాధ్యాయులు ఎంతో అసౌకర్యంగా గురవుతున్నారు. అది అంతిమంగా గురుకుల విద్యార్థులు, గురుకుల విద్యావ్యవస్థకే చేటు చేస్తుంది. విద్యార్థులపై ఒత్తిడిని దూరం చేసేందుకంటూ ప్రభుత్వమే మళ్లీ ఆధ్యాత్మిక సంస్థలతో మోటివేషనల్ క్లాస్‌లను నిర్వహించాలని చూడటమే విచిత్రం. ఇది తీవ్ర అభ్యంతరకరం. పాఠశాల అనేది లౌకికభావాలకు నిలయం. అవసరమైతే గతంలో మాదిరి కౌన్సిలర్లతో మోటివేషనల్ తరగతులు చెప్పించాలి. గతంలో గురుకుల సొసైటీలో ఏ విధానం అమలు చేయాలన్నా, తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడో ఒకచోట ఏర్పాటు చేసి, ఫలితాలను సమీక్షించి ఆపై అన్ని గురుకులాల్లో అమలు చేసేవాళ్లం. ఇప్పుడు సర్కారుకు ఆ విధానమే లేదు. ఇప్పటికైనా పనివేళలను పునఃసమీక్షించాలి.
స్పోర్ట్స్ వర్సిటీపై మీ అభిప్రాయం?
కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న మరో హాస్యాస్పద నిర్ణయం. గ్రామీణస్థాయిలో, విద్యార్థిదశ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించకుండా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తామంటే ఏమనాలి? రాష్ట్రంలో ఏ సొసైటీలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోనే దాదాపు 60 స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నాయి. ఈ అకాడమీలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో 32 పతకాలు, జాతీయస్థాయిలో 1,500కుపైగా పతకాలు సాధించారు. ఇటీవల స్పోర్ట్స్ అకాడమీకి చెందిన జుడోక్ క్రీడాకారుడు తిరుపతి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ ఆ క్రీడాకారుడికి అయ్యే ఖర్చులన్నీ భరిస్తున్నారు. నందిని అనే నిరుపేద, రజక కుటుంబానికి చెందిన క్రీడాకారిణి అథ్లెట్ ఏషియన్ గేమ్స్‌లో ప్రతిభ చూపింది. బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఇచ్చినట్టు ఆ క్రీడాకారిణికి ప్రోత్సాహకం ఇవ్వలేదు. సరే అవేవీ లేవు అనుకున్నా ఏకంగా ఆ అకాడమీలను మూసేందుకు కుట్రపన్నింది. అకాడమీల్లోని హానరోరియం ఉద్యోగులందరినీ తొలగించాలని పూనుకోవడం అందులో భాగం కాదా?
గురుకుల వ్యవస్థ బలోపేతానికి మీరిచ్చే సలహాలు, సూచనలేమిటి?
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో గురుకుల వ్యవస్థను ఒకరికి మించి ఒకరు ఉన్నతంగా తీర్చిదిద్దారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వానికి చేతనైతే ఆ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. కానీ, నిర్వీర్యం చేయాలనే కుట్రలకు తెరలేపితే సహించబోం. నిధులను పెంచండి, మెరుగైన వసతులను కల్పించండి. జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలను, విజేతలను తీసుకొచ్చి విద్యార్థులకు ప్రేరణ కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి. బడుగులను ఉన్నతవిద్యకు దూరం చేసే కుట్రలను మానుకోండి. ఎస్సీ గురుకుల సొసైటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై వెంటనే సమీక్షించండి. బాధ్యులపై చర్యలు తీసుకోండి.
ఇంటర్నేషనల్ గురుకులాలకు అర్థమేంటి?
అది ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డే చెప్పాలి. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ తమ నియోజకవర్గాలైన కొడంగల్, మధిరలో ఇంటర్నేషనల్ గురుకులాల ఏర్పాటుకు పూనుకున్నారు. విద్యార్థులకు ఎలా ప్రవేశాలు కల్పిస్తారు? ఎవరి ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తారు? తదితర వాటికి సంబంధించి ఇప్పటివరకు మార్గదర్శకాలైతే లేవు. బయట వినిపిస్తున్న దాని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని గురుకులాలను ఒకేచోట ఏర్పాటు చేస్తామంటున్నారు. గతంలో వైఎస్ హయాంలో ఇలాగే ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేశారు. అదొక విఫల ప్రయోగం. కేసీఆర్ నూతన విధానాలతో గురుకులాలను ఏర్పాటు చేశారు. అది విజయవంతమైంది. ఇంటర్నేషనల్ గురుకులాలను ఏర్పాటు చేయడం కాదు, దమ్ముంటే కేసీఆర్ స్థాపించిన గురుకులాలను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలి.