ఖైరతాబాద్, జూలై 9: నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని వీడాలని, లేకుంటే జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అశోక్‌నగర్ క్రాస్‌రోడ్‌లో నిరుద్యోగులతో ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ మాట్లాడి వారితో ఓట్లు వేయించుకున్నారని తెలిపారు. నేడు ఆయన ముఖం చాటేశారనాని ధ్వజమెత్తారు. విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య, ప్రజాసంఘాల సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్‌లో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
సమాఖ్య అధ్యక్షుడు కొంపెల్లి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న వక్తలు నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి వారిపైనే నిర్బంధాలను విధిస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఉద్యమాలను గౌరవించడాన్ని నేర్చుకోవాలని సీఎం రేవంత్‌కు హితవు పలికారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమాలను గౌరవించారని, ఆయన ఎప్పుడూ అణచివేయలేదని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారని, దానిపై నేడు ఎందుకు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. గ్రూప్ 1లో మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిని ఏపీలో పాటిస్తుంటే, తెలంగాణలో న్యాయపరమైన చిక్కులు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. గురుకుల పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం రీలింక్విష్మెంట్ ఆప్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు.
బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని, నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్‌నాయక్‌ను గాంధీ దవాఖానకు ఆయన వెంట వచ్చిన బౌన్సర్లు బెదిరించారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. విద్యార్థులు తిరగబడితే దొడ్డిదారిలో అంబులెన్స్‌లో పారిపోయాడని తెలిపారు. సర్కారు తలచుకుంటే నిరుద్యోగులను సమస్యను పరిష్కరించవచ్చని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క జీవోతో 45 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశారని గుర్తు చేశారు.
మేధావుల కమిటీ, చర్చల పేరుతో నిరుద్యోగుల పోరాటంలోకి మధ్యవర్తులను పంపించి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర జరుగుతున్నదని బీసీ జనసభ అధ్యక్షుడు, విద్యార్థి, నిరుద్యోగుల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్ంలను పరిష్కరించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు నిరుద్యోగులను రెచ్చగొట్టిన కోదండరాంరెడ్డి లాంటి కుహనా మేధావులు ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 15న నిర్వహించనున్న సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్ధి, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.