హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రౌడీల పాలన, గూండాల పాలన, రాక్షస పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టపగలే నట్టనడి నగరంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేటీఆర్‌పై హ త్యకు కుట్ర పన్నారని విమర్శించారు. ప్రపం చ బ్యాంకుతో రేవంత్‌రెడ్డి కుమ్మక్కై మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షా 50 వేల కోట్ల అవినీతికి తెరలేపారని, ఆ కుట్రను బీఆర్ఎస్ అడ్డుకున్నది కాబట్టే కేటీఆర్ కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని మండిపడ్డారు. హైదరాబాద్ నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతె రోహిత్ ఆధ్వర్యంలో కేటీఆర్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
రేవంత్‌రెడ్డి ధనదాహానికి హైడ్రా ఆయుధంలా మారిందని, ఆయన బండారం త్వరలో బట్టబయలు అవుతుందని పేర్కొన్నారు. రేవంత్ రహస్య ఒప్పందాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. శ్రీలంకలో రాజపక్సే సోదరులపై ప్రజలు తిరుగుబాటు చేసినట్టు తెలంగాణలో రేవంత్‌రెడ్డిపై తిరుగుబాటు తప్పదని అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. పట్టపగలు కేటీఆర్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడితే పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారని, పోలీ స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటుపోయిందని నిలదీశారు. దాడి ఘటన వ్యవహారంలో పోలీసు ల వైఖరి అనుమానాస్పదంగా ఉన్నదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి కుట్రకు పోలీసు లు పావులు అవుతున్నారని చెప్పారు. దాడి జరిగి 26 గంటలైనా నిందితులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. తా నే కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నట్టు ట్వీట్ చేసినా రోహిత్‌ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తున్నారా? అని నిలదీశారు.
బీఆర్ఎస్ నేతలపై వరుస దాడులు
కాంగ్రెస్ రాక్షస పాలనతో ప్రతిపక్ష నేతల ఇండ్లు, కార్యాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఏనాడూ ఇలా దాడులకు పాల్పడలేదని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. తాజాగా తెలంగాణభవన్ వద్దకు కాంగ్రెస్ నేతలు వచ్చి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా, అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెట్టారని మండిపడ్డారు. తమ పార్టీ ఆఫీసుపై దాడికి వచ్చిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని, పోలీసులు ఈ వివక్ష ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు ఏనాడూ ఇతర పార్టీల కార్యాలయాల్లోకి వెళ్లలేదని గుర్తుచేశారు.
కానీ, సిద్దిపేటలో హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై, పాడి కౌశిక్‌రెడ్డిపై ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ చేస్తున్న రూ.1.50 లక్షల కోట్ల అవినీతిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నందునే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ప్రపంచ బ్యాంకు వైపు ఉంటే.. బీఆర్ఎస్ పీడిత ప్రజల పక్షాన ఉన్నదని చెప్పారు. కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలపై ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. ప్రపంచ బ్యాంకు ఏజెంట్లు ఎన్ని దాడులు చేసినా ఎదురొంటామని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని, ఓపికకూ ఒక హద్దు ఉంటుందని పేర్కొన్నారు.
రేవంత్‌వి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్
రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. హైడ్రాపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నందున కొండా సురేఖతో అసంబద్ధ్దమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. సురేఖ తన వ్యాఖ్యలపై మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె తన వ్యాఖ్యలను వెనకి తీసుకోవాలని సూచించారు. సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని, ఆమె వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవీందర్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, తుంగ బాలు, నరేందర్, రాజు పాల్గొన్నారు.