నకిరేకల్, జూన్ 19 : దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా లేకపోతే లక్షల ఓట్లు గల్లంతవుతాయని తెలిపారు. తెలంగాణలో లక్షల ఓట్లు తొలగించేందుకు జాతీయ పార్టీలు ‘సర్’తో ఒప్పందం చేసుకున్నాయని దుయ్యబట్టారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన (సర్), బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. బిహార్‌లో 47 లక్షల ఓట్లు, బెంగాల్లో 35 లక్షల ఓట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల ఓట్లు తొలగించారని, తెలంగాణలో ఓట్ల మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా లక్షల ఓట్లు తొలగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలను, వారి ఓట్లను రక్షించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి తాను కూడా గస్తీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేసిఆర్, కేటిఆర్, హరీశ్‌రావులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న రేవంత్‌రెడ్డి, ఆయన టీమ్‌కు బుద్ధిచెప్పే రోజులు ముందున్నాయని అన్నారు. ఈ నెల 25 నుంచి ‘సర్’ ప్రారంభమవుతుందని, బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, బాలరాజు పాల్గొన్నారు.