వనపర్తి : జూపల్లి కృష్ణారావుని(Jupalli Krishna Rao) మంత్రివర్గం (Cabinet)నుంచి వెంటనే తొలగించాలి. రాజకీయ హత్యలపై నిష్పక్షపాత విచారణ జరపాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లా ప్రాంతాలు జూపల్లి కృష్ణారావు వల్ల కల్లోలిత ప్రాంతాలుగా మారుతున్నాయ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11రోజులు అవుతున్నా నేటికి హంతకులను పట్టు కోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో రెండు హత్యలు, ఒక హత్యాయత్నం, దాడులు పెరిగిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పేగులు తీసి మెడల వేసుకుంటా, ఇతర పార్టీ నాయకులను బొంద పెడుతా వంటి మాటలతో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కక్షసాధింపు చర్యలు మానుకొని ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయాలని హితవు పలికారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన జెట్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు.