దహెగాం,ఆగస్టు15 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ. 30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం ఖర్జీ, గిరివెల్లి, గెర్రె ప్రాంతాల్లో వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వేలాది రూపాయలు ఖర్చుచేసి పత్తి, వరి పంటలు సాగు చేశారని, వేలాది ఎకరాల పంటలు నీటమునిగి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే స్పందించి నష్టం జరిగిన పంటలను సర్వేచేయించి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఖర్జీ చెరువుకు మత్తడి పాడైపోయి ఏళ్లుగడుస్తున్నా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. వెంటనే మరమ్మతులు చేయించి ఆయకుట్టుకు నీరందించాలని కోరారు. దహెగాం మండలంలో రోడ్లు అధ్వానంగా మారాయిని, నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల లోహ గ్రామానికి చెందిన ఓ గిరిజన యువతి పాముకాటుకు గురికాగా రోడ్డు సౌకర్యంలేక.. సమయానికి దవాఖానకు చేరుకోలేక మార్గంమధ్యలో మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.