హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడుతున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలా జరగడం ఘోరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలపై మరణాయుధాలతో దాడిచేసి, తీవ్రంగా గాయపరిచిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు తెగబడుతున్న కాంగ్రెస్ గూండాలపై వెంటనే పీడీయాక్ట్ నమోదు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి డీజీపీ రవిగుప్తాకు గురువారం వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డికి గన్‌మెన్ కేటాయించాలని ఆర్ఎస్ ప్రవీణ్ విన్నవించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మలాబాలరాజు ఇంటిపై మరణాయుధాలతో దాడిచేసి, హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై వరుస దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంగూరులో పోలింగ్ రోజున బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. కాంగ్రెస్ గూండాలతో బీఆర్ఎస్ నేతలకు ప్రాణహాని ఉన్నదని, వారికి రక్షణ కల్పించాలని డీజీపీని కోరామని చెప్పారు. నయీం లాంటి ముఠాలను మళ్లీ పెంచిపోషిస్తున్నారని, అవన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయని తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధీనంలో ఆ ముఠాలు ఆశ్రయం పొందుతున్నాయని ఆరోపించారు.
కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతో బీఆర్ఎస్ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సోషల్ మీడియా పోస్ట్‌పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో వేశారని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతాయని ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. మంత్రికో న్యాయం? క్రిశాంక్‌కు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. గువ్వల బాలరాజుకు, తనకు ప్రాణహాని ఉన్నదని, తమకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరినట్టు బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.