మంచిర్యాల, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దాదాపు 50 ఏండ్లుగా పోడు చేసుకుని బతుకుతున్న తమను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, తమ ఆకలి కేకలు, గోసను ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకొందామని పాదయాత్రగా బయలుదేరిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామానికి చెందిన 60 మంది రైతులు ఈ నెల 5న పాదయాత్ర చేపట్టారు. బుధవారం రాత్రి హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట ఓఆర్ఆర్ దగ్గరకు చేరుకున్నారు. గురువారంఉదయాన్నే రైతుల దగ్గరికి వచ్చిన పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఎవరైనా ఐదుగురు రావాలని, ఎవరొస్తారో పేర్లు ఇవ్వాలని అడిగారు. దానికి రైతులు మాట్లాడుకుని చెప్తామనగా సరే అన్న పోలీసులు.. అరగంట తిరక్కుండానే రెండు వాహనాలు తెప్పించి బలవంతంగా కొట్టుకుంటూ వాహనాల్లోకి ఎక్కించినట్టు రైతులు చెప్తున్నారు.
అక్కడి నుంచి రైతులను తిరిగి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కాగజ్‌నగర్‌లో రైతులు ఉన్న వాహనాలను అడ్డగించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిపి రోడ్డుపై బైఠాయించారు. దిందా గ్రామంలో ఫారెస్ట్ క్యాంప్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి లేదా మంత్రి కొండా సురేఖ దిందా గ్రామంలో ఫారెస్ట్ క్యాంప్‌ను ఎత్తేస్తున్నామని, రైతులు వాళ్ల భూములు వాళ్లు సాగు చేసుకోవచ్చని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి దాకా పోలీసుల వాహనాలను ముందుకు వెళ్లనిచ్చేది లేదని బీష్ముంచుకొని కూర్చున్నారు. రైతులను కొట్టినందుకు, మహిళా రైతులను ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాహనాల్లో రైతులను ఎటు తీసుకెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు.
ఆర్ఎస్పీ అరెస్ట్.. విడుదల
ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టి ఆర్ఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా లాక్కెళ్లి వాహనంలో ఎక్కించి సిర్పూర్(టీ)కి తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులు మరోసారి పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. వారిని తప్పించి ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ కాగజ్‌నగర్ ఇన్చార్జి లెండుగురె శ్యాంరావ్, బెజ్జూర్ నాయకుడు హర్షద్ హుస్సేన్‌ను కౌటాల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడికి బీఆర్ఎస్ నాయకులు చేరుకొని ధర్నా చేశారు. సాయంత్రం 4 దాటినా వారిని వదలకపోవడంతో స్థానిక బస్టాండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆర్ఎస్పీని బయటికి పంపారు.
రైతుల నిర్బంధం
బీఆర్ఎస్ ధర్నాలు, నిరసనల నేపథ్యంలో కాగజ్‌నగర్‌కు తీసుకొచ్చిన దిందా రైతులను పోలీసులు కాగజ్‌నగర్ రూరల్, వాంకిడి, రెబ్బెన పోలీస్ స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వారిని పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను బయటికి పంపించాక సాయంత్రం ఆరు తర్వాత రైతులను కూడా వాహనాల్లో ఎక్కించుకుని దిందా గ్రామానికి తీసుకెళ్లారు. తమను అరెస్ట్ చేసి నిర్బంధించడంపై దిందా రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటికి తీసుకెళ్లి వదిలేసినా మళ్లీ హైదరాబాద్‌కే వెళ్తామని, సీఎంను కలిసి తమ సమస్య చెప్పుకునే దాకా వదిలేది లేదని స్పష్టంచేశారు. తమ భూములు సాగు చేసుకోనివ్వడం లేదని, పంట చేసుకోకుండా ఆకలితో సచ్చేకంటే సాగు చేసుకునేందుకు అనుమతి ఇచ్చేదాకా పోరాడుతామని తెగేసి చెప్పారు. పోలీసులు వాహనాల్లో ఎక్కించేటప్పుడు కొట్టారని, బలవంతంగా ఈడ్చుకొచ్చి ఎక్కించారని వాపోయారు. కనీసం భోజనం పెట్టకపోగా, మంచినీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అంతా కలిసి మాట్లాడుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని దిందా పోడు రైతులు డోకే రామయ్య, కంటే ప్రకాశ్, ధనుర్కార్ లక్ష్మయ్య తెలిపారు.
సర్కార్ గూండాగిరీకి నిదర్శనం : కేటీఆర్
పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్బంధించడం రేవంత్ ప్రభుత్వ గూండాగిరీకి నిదర్శనం. పోడు రైతులను వేధించడం ఆపి, వారికి వెంటనే పట్టాలివ్వాలి. కుట్రపూరిత అరెస్టులను మానుకోవాలి. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కర్కశంగా విరుచుకుపడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గర్లోనే ఉన్నది’ అని హెచ్చరించారు.
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం : హరీశ్‌రావు
దిందా పోడు రైతులు, బీఆర్ఎస్ నాయకుల అక్ర మ అరెస్టులను మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ‘పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రోడ్డెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పా? రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా?’ అని నిలదీశారు.
ఇది రాక్షస పాలన : కొప్పుల
రాష్ట్రంలో నడుస్తున్నది రైతు పాలన కాదు..రాక్షస పాలన అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దిందా గ్రామ పోడు రైతుల అక్రమ నిర్బంధాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఇతర నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌కు దిందా రైతుల ఉసురు తగులుతది : ఆర్ఎస్పీ
పోడు రైతుల అరెస్ట్ పిరికిపంద చర్య అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోడు రైతుల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. దిందా రైతుల ఉసురు రేవంత్‌రెడ్డికి తప్పకుండా తగులుతుందని నిప్పులు చెరిగారు. రైతులను కొ ట్టుకుంటూ చిత్రహింసలు పెడుతూ బస్సుల్లో తీసుకొచ్చేటప్పుడు మూత్రానికి కూడా పోనివ్వకుండా, వాళ్లకు తిండిపెట్టకుండా హించించారని ఆవేదన వ్యక్తంచేశారు. పేద రైతులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వారు ఏం పాపం చేశారో చెప్పాలని నిలదీశారు. ‘రేవంత్‌రెడ్డి ఆస్తులను గుంజుకుంటున్నరా? లేక మంత్రుల ఆస్తులను గుంజుకుంటున్నరా? కోడుగుడ్ల కుంభకోణం చేస్తున్నరా? లేక కంచ గచ్చిబౌలిలో రేవంత్‌రెడ్డి ఎలాగైతే ఫారెస్ట్‌ను కబ్జా చేయాలని చూశారో అట్లా ఏమైనా చేశారా?’ అని నిలదీశారు.
‘కేవలం పొట్టకూటి కోసం పోడు సాగు చేసుకుంటున్నవారిని కొట్టుకుంటూ, చిత్రహింసలు చేస్తూ అడవుల్లోకి ఎందుకు తీసుకుపోతున్నరు? వాళ్లను ఏమైనా ఎన్కౌంటర్ చేస్తరా? ఇవన్నీ ప్రశ్నిస్తూ శాంతియుతంగా మేం ధర్నా చేస్తుంటే పోలీసులు మమ్ములను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేశారు. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది’ అని మండిపడ్డారు. కంచె గచ్చిబౌలిలో రేవంత్‌రెడ్డి వందలాది మంది పోలీసుల సాయంతో పట్టపగలే బుల్డోజర్లు తెచ్చి నెమళ్లు, జింకలను చంపుకొంటూ వందల ఎకరాల అటవీ భూమిని నాశనం చేస్తే.. కనీసం వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద ఒక్క కేసు కూడా పెట్టలేదని పేర్కొన్నారు. దిందాలో ఫారె స్ట్ క్యాంప్‌ను వెంటనే ఎత్తివేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పటి దాకా రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.