హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ఎస్టేట్ రంగాలను నాశనం చేసినట్టే రేవంత్‌రెడ్డి సరార్ విద్యారంగాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన బీఆర్ఎస్ నేతలు అభిలాశ్, మహిపాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రతిభా పాఠశాలల ప్రవేశాల కోసం పెట్టిన ఎంట్రెన్స్ టెస్ట్‌ను ఎందుకు రద్దుచేశారని మండిపడ్డారు. గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ 39 ప్రతిభా పాఠశాలలు నెలకొల్పారని, వాటి నుంచి ఎంతోమంది డాక్టర్లు, ఇంజినీర్లు తయారయ్యారని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు.
ఇప్పుడు ప్రతిభా పాఠశాలలను రద్దు చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. గురుకులంలో చదివిన రజక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని అగసార నందిని బ్యాడ్మింటన్ నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధిస్తే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకం ప్రకటించలేదని ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని, ఈ ఘటనపై మాట్లాడిన బీఆర్ఎస్ నేతలపై వార్త రాసిన టీ న్యూస్ రిపోర్టర్‌పై కేసు పెట్టారని విమర్శించారు. విద్యార్థినులను కూడా పోలీస్‌స్టేషన్‌లో విచారించారని తెలిపారు.
కేసీఆర్ హయాంలో గురుకుల సిబ్బందికి ప్రతినెల మొదటి వారంలో జీతాలు వచ్చాయి. నేడు పదో తేదీ దాటినా వేతనాలు అందే పరిస్థితి లేదు. గురుకులాల్లో ప్రవేశానికి కేసీఆర్ హయంలో ఒక సీటుకు ముగ్గురు పోటీ పడేవారు. ఇప్పుడు మూడుసార్లు గడువు తేదీ పొడిగించినా స్పందన లేదు. విద్యాశాఖను సీఎం రేవంత్‌రెడ్డి తన వద్దే పెట్టుకున్నది ఆ రంగాన్ని కూకటివేళ్లతో పెకలించడానికా?
– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్