హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా హామీ అందని ద్రాక్షగానే మిగిలింది. వానకాలం పంట గడువు పూర్తికావస్తున్నా అన్నదాతకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగికి రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం పంపిణీకి గడువు దగ్గర పడింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఒక కారుకు ఎకరానికి రైతుభరోసా కింద రూ.7,500 ఇవ్వాలి. ఈ లెక్కన రాష్ట్రంలో 1.53 కోట్ల ఎకరాలకు రూ.11,475 కోట్ల పెట్టుబడి సాయం పంపిణీ చేయాల్సి ఉంటుంది. దసరాకు పంపిణీ చేస్తారని ఊరించినా చివరికి ఉసూరుమనిపించింది. దీంతో రైతుల్లో అసహనం నెలకొన్నది. ఇదే సొమ్మును రైతు రుణమాఫీకి జమ చేసి పెట్టుబడి సాయాన్ని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ సర్కారు కనీసం రైతుభరోసా ఊసే ఎత్తడం లేదు. నిరుటి యాసంగికి డిసెంబర్, జనవరిలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని పంటలు కొతకొచ్చే ఆగస్టులో పంపిణీ చేసింది. ఈ ఏడాది జూలైలో ఇవ్వాల్సిన వానకాలం పెట్టుబడి సాయాన్ని అక్టోబర్ పూర్తవుతున్నా ఇవ్వనే లేదు. మరో నెల గడిస్తే ఈ ఏడాది యాసంగి రైతుభరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వానకాలం సాయానికే దిక్కులేదు… ఇక యాసంగిపై ఆశలు పెట్టుకోవడం అత్యాశే అవుతుందనే చర్చ అన్నదాతల్లో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు సీజన్లలోనూ రైతులకు రైతుభరోసా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
రైతుభరోసా పైసలతో రుణమాఫీ చేసిందా?
వానకాలం సీజన్ రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంపై వివిధ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం అరకొరగా రుణమాఫీ చేసింది. ఈ రుణమాఫీకి రూ.18 వేల కోట్లు ఖర్చు చేసింది. రైతుభరోసాకు ఇవ్వాల్సిన నిధులతోనే రుణమాఫీ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రైతుభరోసాను పక్కకు పెట్టిందనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉంటుంది. ఇటు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తూతూ మంత్రంగా మంత్రుల కమిటీ!
రైతులు, రైతుసంఘాల అభిప్రాయాలు సేకరించి రైతుభరోసా విధి విధానాలను రూపొందించేందుకని జూలై 2న ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. ఈ కమిటీ రైతుల అభిప్రాయాలు సేకరించి 15 రోజుల్లో నివేదిక అందిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో రైతుభరోసాపై చర్చ పెడతామని ప్రకటించారు. కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికే మూడు నెలలు గడిచింది. ఇప్పటివరకు మంత్రుల కమిటీ ఏమైందో, కమిటీ నివేదిక ఇచ్చిందో? లేదో? తెలియదు. 15 రోజుల్లో ఇస్తారన్న నివేదిక అతీగతీ లేకుండా పోయింది. మళ్లీ కమిటీ పేరెత్తనే లేదు. రైతుభరోసా గురించి ఆరా తీయడమే లేదు. రైతుభరోసా నుంచి రైతుల దృష్టిని మరల్చేందుకు కమిటీలు, సమావేశాలు, అభిప్రాయాల సేకరణ పేరుతో కాలయాపన చేసిందన్న విమర్శలు ఆనాడే పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి.