హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 11వ విడత రైతుబంధు ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతుబంధు పైసలు ఖాతాలో పడిన మెసేజులతో రైతన్నల మొబైల్స్ మోగాయి. పొద్దుపొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు.. అదే సమయంలో తెలంగాణ సర్కారు పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమచేసి, సంతోషాన్ని నింపింది. పంట పెట్టుబడి సాయం తమ ఖాతాల్లో జమ అయినట్టు వచ్చిన మెసేజ్‌లను చూసుకున్న రైతుల ఆనందం అంతాఇంతా కాదు. సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పంట పొలాల్లో ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన సోమవారం ఎకరం భూమి ఉన్న 22.55 లక్షల మంది రైతులకు తెలంగాణ సర్కారు పెట్టుబడి సాయం అందించింది. ఈ మేరకు రూ. 642.52 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎకరాలవారీగా ప్రతిరోజూ రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుందని వెల్లడించారు. రైతుబంధుకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్‌కు నిధులు సమకూర్చిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల అభివృద్ధి కార్యక్రమాలే ప్రథమ ప్రాధాన్యమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తొలిరోజు రైతు బంధు పంపిణీని చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో తెలంగాణ సర్కారు మొత్తం 70 లక్షల మంది రైతులకు రూ. 7,720 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించనున్నది. గతంతో పోల్చితే ఈ సీజన్లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా పెట్టుబడి సాయం అందించనున్నది. రైతులు, భూవిస్తీర్ణం పెరుగడంతో ఈ సీజన్లో రైతు బంధు కోసం రూ. 7,720.29 కోట్లు ఖర్చుచేయనున్నది. గతంతో పోల్చితే ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడుతున్నది. ఈ సీజన్‌తో కలిపితే రైతుబంధు ద్వారా రూ.72,910 కోట్లు రైతుల ఖాతాల్లో జమయినట్టువుతుంది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఈ సారి 1.5 లక్షల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం అందించనున్నారు.
జోరుగా ఎవుసం పనులు
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఎవుసం పనులు జరుగుతున్నాయి. ఓ వైపు పెట్టుబడి గోస లేకుండా ప్రభుత్వం రైతుబంధు పంపిణీ ప్రారంభించి పైసలు జమ చేస్తుండడంతో రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలన్నీ కలిపి 11.36 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇందులో 7.18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు కాగా, వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం 4.18 లక్షల ఎకరాలు నమోదయింది. అత్యధికంగా పత్తి 3.24 లక్షల ఎకరాల్లో సాగు కాగా 29,056 ఎకరాల్లో కంది సాగైంది. 16,408 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 8,840 ఎకరాల్లో సోయాబీన్ సాగు కాగా, 7,525 ఎకరాల్లో మకజొన్న సాగైందని వ్యవసాయశాఖ వెల్లడించింది.
సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు
సీఎం కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడు. వానకాలం, యాసంగిలో రైతులకు రైతుబంధు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నాడు. సమైక్య రాష్ట్రంలో ఎరువుల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఎలాంటి కష్టం లేకుండా ఎరువులు, విత్తనాలు తెచ్చుకుంటున్నాం. సమయానికి డబ్బులు పడటంతో పెట్టుబడికి ఇక్కట్లు తప్పాయి. నా జీవితంలో సీఎం కేసీఆర్ సారును ఎప్పుడూ మర్చిపోను.
–జోగ్గారి బాల్‌నర్సయ్య, రైతు, లింగుపల్లి గ్రామం, మిరుదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా