హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ ) : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్. 2017లో అప్పటి కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఒక సంవత్సరం మిగిలిన సబ్‌ప్లాన్ నిధులు ఆటోమేటిక్‌గానే మరో ఏడాదికి బదిలీ అవుతాయి. ఆ విషయాన్ని దాచిపెట్టి ఈ ఏడాది భారీగా నిధులను కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి చట్టం 2017ను ప్రవేశపెట్టింది. ప్రతీ ఆర్థిక సంవత్సరం పద్దు వ్యయంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నిధులను కేటాయించారు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించని నిధులను ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించుకునేలా పరిహారం రూపంలో నిబంధనను చేర్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రగతి పద్దు వ్యయంలో రూ.1,74,710.69 కోట్లలో ఎస్సీ జనాభాకు అనుగుణంగా 15.45 శాతం నిధులను కేటాయించాల్సి ఉంది.
కానీ ప్రభుత్వం 23.01శాతం నిధులు అంటే రూ.40,232 కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్తున్నది. అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి 9.8 శాతం అంటే రూ.17,169 కోట్లను పొందుపరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖర్చు చేయకుండా మిగిలిపోయిన ఎస్సీలకు చెందిన 13,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్లను కూడా కేటాయిస్తున్నామని బడ్జెట్లో ప్రకటించినా ఆ మేరకు నిధులను పొందుపరచలేదు. బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో ప్రత్యేకంగా చూపలేదు. ప్రస్తుతం కేటాయించిన ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల్లోనే వాటిని కూడా కలిపారా? లేదా అనేది కూడా స్పష్టం చేయలేదు. గతంలో మిగిలిపోయిన నిధులను కలిపినట్లయితే ఈ బడ్జెట్లో వాస్తవంగా ఎస్సీ సబ్‌ప్లాన్ కింద కేటాయించింది 26,615 కోట్లుగానే భావించాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ప్రభుత్వం కేటాయించింది 15.23 శాతం నిధులను మాత్రమే. సబ్‌ప్లాన్ కింద కేటాయించాల్సిన 15.45శాతం కంటే తక్కువే.
2024-25 బడ్జెట్లో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం రూ.33,127 కోట్లు కేటాయించింది. డిసెంబర్ నెలాఖరు నాటికి రూ.9,824 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇంకా రూ. 23,303కోట్లు మిగిలిపోయాయి. ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌కు రూ.17,056 కోట్లు కేటాయించగా, డిసెంబర్ నెలాఖరు నాటికి రూ.6,766 కోట్లు ఖర్చు చేసింది. రూ.10,299 కోట్లు మిగిలిపోయాయి. ఆ మిగిలిన నిధుల సంగతిని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో వెల్లడించలేదు.
ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని గురుకులాలను కలిపి ఒకే సముదాయంలో ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇప్పటికే 58 గురుకుల భవనాలను 11,600కోట్లను మంజూరు చేసింది. ఆ నిధులన్నింటినీ ఒక్క ఎస్సీశాఖ ద్వారా, ఎస్సీ సబ్‌ప్లాన్ నుంచే ఖర్చు చేయనుంది. ఈ మేరకు తాజా బడ్జెట్లో యంగ్ ఇండియా గురుకుల భవనాల నిర్మాణానికి రూ.2400కోట్లను కేటాయింపులు చేసింది.