హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆదరణ పొందిన ‘బతుకమ్మ చీరల’ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. బదులుగా ‘రెండు చీరలు’ ఇస్తామని ప్రకటించింది. ఏడాదైనా ఇప్పటివరకు ‘రెండు చీరల’ పథకాన్ని అమలు చేయడంలో సర్కారు తాత్సారం చేస్తున్నది.
రాష్ట్రంలోని పవర్లూమ్ కార్మికులను ఆదుకోవడానికి చీరల తయారీ కోసం ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 1.40 కోట్ల చీరల తయారీ కోసం రూ.400 కోట్లపైగా అవసరం ఉంటుందని అంచనా వేసింది. కానీ ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నది. ఆరు గ్యారెంటీలకే నిధులు లేవని, ఇక చీరల పథకానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలని ఆర్థికశాఖ మెలిక పెట్టింది. దీంతో వచ్చే బడ్జెట్లో కూడా ‘రెండు చీరల పథకానికి’ నిధులు కేటాయిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై వస్త్ర పరిశ్రమకు చెందిన కార్మిక సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. తమ ఆకలి చావులకు కాంగ్రెస్ సర్కారే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 30 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తమ బతుకులు ఆగమయ్యాయని, పవర్లూమ్ కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు కూరపాటి రమేశ్, చేనేత కార్మిక సంఘం నాయకులు చెరుకు సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదింటి మహిళలకు అందించాల్సిన చీరలను కేవలం స్వయం సహాయక గ్రూపు సభ్యులకే అందిస్తామని చెప్పడంపై మండిపడుతున్నారు.