హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : 136 ఏండ్లకు పైగా చరిత్ర గల సింగరేణి (Singareni) సంస్థను కాంగ్రెస్ సర్కారు (Congress Govt) నిర్వీర్యం చేస్తున్నది. సంస్థను వాడుకుని వదిలేస్తున్నది. సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంలేదు. కార్మిక సంఘాల కథనం ప్రకారం ఈ బకాయిల మొత్తం అక్షరాలా రూ. 24 వేల కోట్ల పైమాటే. అది కూడా ఈ 20 నెలల్లోనే. అంటే సగటున నెలకు రూ. 1,200 కోట్లు కాంగ్రెస్ సర్కారు సింగరేణికి బకాయి పడింది. బొగ్గు సరఫరా చేసినందుకు టీజీ జెన్కో, సింగరేణి విద్యుత్తు వాడుకున్నందుకు టీజీ ట్రాన్స్‌కోలు ఈ మొత్తం బకాయిపడ్డాయి. దీంతో సింగరేణి సంస్థ భారీగా నష్టపోతున్నది. మొత్తంగా సింగరేణి సంస్థకు సర్కారు రూ. 44 వేల కోట్లు బకాయి పడింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ. 19వేల కోట్లుంటే, ప్రస్తుత కాంగ్రెస్ 24వేల కోట్ల రూపాయల మేరకు బకాయి పడింది.
ఉమ్మడి ప్రభుత్వం నుంచి సింగరేణికి బకాయిలు వారసత్వంగా వస్తున్నాయి. ఆ తర్వాత పదేండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బకాయిల మొత్తం రూ. 19 వేల కోట్లు మాత్రమే. అంటే బీఆర్ఎస్ 115 నెలల కాలంలో, నెలకు సగటున రూ. 165 కోట్ల చొప్పున బకాయి పడగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నెలకు రూ. 1,200 కోట్ల చొప్పున బకాయిపడ్డది. బీఆర్ఎస్ సర్కారుతో పోల్చితే ఏడు రెట్లు అధికం. మరో మూడేండ్లు కాంగ్రెస్ రాష్ర్టాన్ని పాలించాల్సి ఉండగా, ఈ బకాయిల విలువ మరో 50వేల కోట్లకు చేరే ప్రమాదం పొంచి ఉందని కార్మిక సంఘాలంటున్నాయి. వాస్తవాలిలా ఉంటే కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్పై నిందలేస్తున్నారు. తామసలు సింగరేణికి బకాయి పడలేదని బుకాయిన్నారు. సింగరేణిని ఉద్దరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. విద్యుత్తు సంస్థలు సింగరేణికి బకాయి పడింది నిజమేనని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అంగీకరించారు.
ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 44 వేల కోట్ల బకాయిలు సంస్థ పాలిట గుదిబండగా మారాయి. సింగరేణి బతకాలంటే బకాయిలను చెల్లించాల్సిందే. కొత్త మైన్స్ రావడంలేదు. మిషనరీ కొనడంలేదు. డంపర్లు, డోజర్లు కొనడంలేదు. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. బకాయిలతో సంస్థ ము నుగుతుందని అప్పుడు భట్టివిక్రమార్క అన్నారు.
సింగరేణి సంస్థ 136 సంవత్సరాల చరిత్ర గల పురాతన సంస్థ. ఇలాంటి సంస్థ ను కాపాడాల్సిన బాధ్య త సర్కారుపై ఉంది. కానీ ఈ 20 నెలల్లోనే సంస్థను సర్వనాశనం చేశారు. నెలకు రూ. 1200 కోట్ల చొప్పున బకాయి పడ్డారు. దీనిపై టీబీజీకేఎస్ తరపున త్వరలో పోరాటం చేస్తాం. ఈ సంస్థ మనుగడ కోసం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. 14 కొత్త బొగ్గు గనులను ప్రారంభించారు. బొగ్గుబ్లాక్‌లు వేలం వేస్తే అసెంబ్లీ సాక్షిగా వ్యతిరేకించారు. ఇటీవల సింగరేణిలో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం పెరిగింది.