హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): బేస్మెంట్ పూర్తిచేసుకున్న 2019 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ. 20.19 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో 70,122 ఇండ్లు మంజూరు చేయగా, 13,500 ఇండ్ల బేస్మెంట్ పూర్తయినట్టు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా 12మంది లబ్ధిదారులకు లాంఛనంగా రూ. లక్ష చొప్పున చెక్కులను అందజేసినట్టు పేర్కొన్నారు. బేస్మెంట్ పూర్తయ్యాక రూ.ఒక లక్ష, గోడలకు రూ.1.25 లక్షలు, శ్లాబుకు రూ.1.75 లక్షలు, ఇల్లు పూర్తయ్యాక మిగతా రూ.లక్ష విడుదల చేయనున్నట్టు తెలిపారు. అధికారుల కోసం వేచిచూడకుండా లబ్ధిదారులే తమ నిర్మాణ పురోగతిని ఫొటో తీసి మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేసినా డబ్బులు వారి ఖాతాల్లో జమవుతాయని పేర్కొన్నారు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చ.అ.లకు మించకుండా ఇల్లు నిర్మాణం ఉం డాలని తెలిపారు. అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవం తం చేయడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం ఉండేలా చూసేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్టు మంత్రి తెలిపారు.