హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రైతులను రుణ విముక్తులను చేసే చరిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ప్రశంసించారు.
రుణమాఫీకి ఆర్థిక పరిస్థితి సహకరించపోయినా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. ఆగస్టు 15కు నెల రోజుల ముందుగానే హామీని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. గురువారం లక్ష వరకు రుణమాఫీ అమలవుతున్నదని, సాయంత్రం వరకు రైతు రుణ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని స్పష్టంచేశారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన రోజు అని పేర్కొన్నారు.