హైదరాబాద్, జనవరి 5 (నమస్తేతెలంగాణ) : ఎన్నికల హామీల్లో ఒకటైన ఎకరాకు రూ.15వేల (ఏడాదికి) రైతుభరోసాను అమలుచేయాల్సిందేనని తెలంగాణ రైతు సంఘం డి మాండ్ చేసింది. రూ.15 వేలు కా కుండా రాష్ట్ర క్యాబినెట్ రూ.12వేలు చెల్లిస్తామని నిర్ణయించడం మోసపూరితమని పేర్కొంది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి టీ సాగర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు గత ప్రభుత్వం రైతుబంధు ప్రకటించిందని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగం ఓట్లు ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా వానకాలం సీజన్ రైతుభరోసా ఇవ్వకపోగా, ఇప్పుడు ఎకరాకు రూ.12 వేలే ఇస్తామని ప్రకటించడం అన్యాయమని పేర్కొన్నారు. క్యాబినెట్ పునరాలోచన చేసి ఏటా ఎకరాకు రూ.15 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.