హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): పట్టణాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.11,372 కోట్లు ఇచ్చారు. నిర్వహణ పద్దుకు రూ.3,906 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రగతి పద్దుకు ప్రతిపాదించారు. పట్టణ ప్రగతికి రూ.1,474 కోట్లు ఇవ్వగా.. ఇది నిరుటి కంటే 80 కోట్లు అధికం. పట్టణాభివృద్ధికి రూ.6 వేల కోట్లు, వీటికి అదనంగా మున్సిపాలిటిల అభివృద్ధికి రూ.300 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అర్బన్ భగీరథకు రూ.900 కోట్లు, పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా తీసుకొనే రుణాలకు వడ్డీ చెల్లించేందుకు 651 కోట్లు, అమృత్ 2.0కు గ్రాంట్‌గా రూ.259 కోట్లు, కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీలకు రూ.341 కోట్ల చొప్పున కేటాయించారు. జలమండలికి రూ.300 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రోకు రూ.500 కోట్లు, మిలియన్ ప్లస్ సిటీస్ పథకంలో భాగంగా హైదరాబాద్‌కు రూ.349 కోట్లు, ఇతర పట్టణాలకు రూ.388 కోట్లు కేటాయించారు. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు రూ.400 కోట్లు, వైకుంఠధామాలకు రూ.100 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి మున్సిపాలిటీలకు రూ.737 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.