CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిత్యం అదానీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం అదానీతో దోస్తీ చేస్తున్నది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అదానీ గ్రూపు ఇటీవలే ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళం ఇచ్చింది. సిమెంట్ పరిశ్రమలో గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న అదానీ గ్రూప్ అందులో భాగంగా రాష్ట్రంలో సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో విద్యుత్తు, సిమెంట్, డాటా సెంటర్లు తదితర రంగాల్లో రూ. 12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. డాటా సెంటర్ ఏర్పాటుకు రూ. 5,000 కోట్లు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రెండు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు (పీఎస్పీ)ల ఏర్పాటుకు రూ. 5,000 కోట్లు, రక్షణ రంగంలో ఆర్అండ్డీ ఎకోసిస్టం ఏర్పాటుకు రూ. 1000 కోట్లు, సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 1400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నగూడెంలో 70 ఎకరాల్లో వచ్చే ఐదేండ్లలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అదానీ గ్రూపునకు సంబంధించిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమకు సంబంధించి ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే, సిమెంట్ కంపెనీతో తమ జీవితాలు బుగ్గిపాలవుతాయని, ఎట్టి పరిస్థితిలో సిమెంట్ పరిశ్రమను అనుమతించేది లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ స్థానిక అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సిమెంట్ పరిశ్రమల ఏర్పాటులో దూకుడుగా వ్యవహరిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పటికే ఏటా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అల్ట్రాటెక్ తరువాత దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ఎదిగింది. రాష్ట్రంలో సిమెంటు పరిశ్రమ ఏర్పాటు ద్వారా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగనున్నది.
రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థను అదానీ గ్రూప్‌కు ప్రభుత్వం అప్పగిస్తున్నట్టు వార్తలు వెలువడడం, ఇటీవలే పాతబస్తీ ప్రాంతంలో ఆ గ్రూప్‌కు చెందిన కొందరు సిబ్బంది ఇండ్లలో కరెంటు మీటర్ల వివరాలు సేకరించడంతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మరువకముందే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు సన్నాహాలు మొదలు కావడం గమనార్హం. క్రమంగా రాష్ట్రంలో అదానీ వ్యాపార కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్రతివాచీ పరుస్తున్నట్టు స్పష్టమవుతున్నది. పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిత్యం విమర్శలు గుప్పించే కంపెనీతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం అనుమానాలకు తావిస్తున్నది. గౌతమ్ ఫౌండేషన్ తరపున గౌతమ్ అదానీ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్లు విరాళం ఇచ్చారు. ఒక కంపెనీ ప్రభుత్వానికి ఇంత భారీస్థాయిలో విరాళం ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వ్యాపార కార్యకలాపాలు మొదలు కాకముందే రూ. 100 కోట్లు విరాళం ఇవ్వడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మోదీ ప్రభుత్వం ప్రజల సొమ్మును అదానీ గ్రూప్‌కు దోచిపెడుతున్నదని పదేపదే విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో అదానీ వ్యాపారాలపై మాత్రం నోరు మెదపడంలేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పెద్దలు అదానీని వ్యతిరేకిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ ప్రభుత్వం వారితో దోస్తీ చేస్తుండడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ సర్కారు సైతం తెలంగాణలో అదానీ పెట్టుబడులకు తమవంతు సహకారం అందిస్తున్నదని, దీన్నిబట్టి కాంగ్రెస్, బీజేపీలు కలిసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని స్పష్టమవుతున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.