ఆదిలాబాద్, అక్టోబర్ 11( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ.10.50 కోట్లు మంజూరు చేయించినట్టు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన బాలుర గురుకుల పాఠశాలతోపాటు ఇచ్చోడ జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు. గిరిజన పాఠశాలలో విద్యార్థులతో కబడ్డీ ఆడారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. తాను ఇచ్చోడ జిల్లా పరిషత్ స్కూల్లో చదివి పీఈటీ అయ్యాయని, అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా అయినట్టు తెలిపారు. ఇచ్చోడ పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయించినట్టు చెప్పారు. ఇటీవల వర్షాలతో నీట మునిగిన ఇచ్చోడ గిరిజన ఆశ్రమ పాఠశాలకు రూ. 50 లక్షలు, డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ. 2 కోట్లు, గిరిజన బాలుర గురుకుల పాఠశాల మరమ్మతుల కోసం రూ. కోటి, లఖంపూర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల డైనింగ్ నిర్మాణం కోసం రూ. కోటి మంజూరు చేయించినట్టు పేర్కొన్నారు.