Runa Mafi | వికారాబాద్, ఆగస్టు 19, (నమస్తే తెలంగాణ): పేద రైతులకు లేనిపోని నిబంధనలు పెట్టి రుణమాఫీకి దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ వర్తింపజేసింది. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం, రైతుల వివరాలను తప్పుగా చేర్చడం వంటి కారణాలతో అర్హులైన పేద రైతులను రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేసింది. దీంతో పేద రైతులను అప్పులపాలు చేస్తున్న ప్రభుత్వం తమ ప్రజాప్రతినిధులకు మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా మాఫీ అమలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ప్రభుత్వం తాండూరు పీఏసీఎస్‌లో ఆయన తీసుకున్న రూ.1.50 లక్షల రుణాన్ని మాఫీ చేసింది.
షరతులు పెట్టి జిల్లాలోని సుమారు 80 వేల మంది పేద రైతులకు నష్టం చేసిన ప్రభుత్వం.. స్పీకర్‌కు రుణమాఫీ వర్తింపజేయడంతో జిల్లాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు సవాలక్ష కొర్రీలు పెట్టి కోత విధించి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రుణాలను మాఫీ చేయడంతో జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ప్రసాద్‌కుమార్ తీసుకున్న రూ.1.50 లక్షల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయడంతో సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన అప్రమత్తమైనట్టు తెలిసింది. మాఫీ అయిన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు కలెక్టర్‌కు సమాచారం ఇచ్చినట్టు సమాచారం.