హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్త ర భాగం నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరే కారణం. రైతులు కోరుతున్న విధంగా బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కా కపోయినా కనీసం న్యాయమైన నష్టపరిహారం చెల్లిస్తే ఈ భూసేకరణ ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం ఉన్నది. కానీ, అరకొర ధరకే భూ ములు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు భావిస్తుండడంతో ట్రిపుల్ఆర్ నిర్మాణం కాగితాలను దాటి కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
వాటిలో ట్రిపుల్ఆర్ ముఖ్యమైనది. ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు.. భూసేకరణలో జాప్యం కారణంగా పెండింగ్లో ఉన్నది. ట్రిపుల్ఆర్ను 4 లేన్లతో నిర్మించాలని తొలుత నిర్ణయించడంతో ఎన్హెచ్ఏఐ గతంలో టెండ ర్లు ఆహ్వానించింది. కానీ, తర్వాత ప్లాన్ ను 6 లేన్లకు మార్చడంతో మరోసారి టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నది. కానీ, భూసేకరణ పూర్తికాకపోవడంతో టెండర్ల ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. ట్రిపుల్ఆర్లో 161. 5 కి.మీ. పొడవైన ఉత్తర భాగం రహదారి పనుల అంచనా వ్యయం రూ.27 వేల కోట్లకు చేరిందని, ఇందులో భూసేకరణకు రూ.6 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
భూసేకరణ ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉండటంతో రేవంత్ సర్కార్ తన వాటా కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,525 కోట్లు కేటాయించింది. నిధులను మాత్రం విడుదల చేయలేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఉత్తర భాగం నిర్మాణానికి 1,933 హెక్టార్ల భూమి అవసరం. ఇప్పటివరకు 13% భూములకు మాత్రమే నష్టపరిహారం చెల్లింపు పూర్తయింది. అసైన్డ్ భూముల పట్టాదారులు మాత్రమే నష్ట పరిహారం తీసుకునేందుకు ముందుకొచ్చారని, ప్రైవేటు పట్టాదారులు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని భీష్మించారని అధికారులు తెలిపారు.
ఎకరాకు రూ.6 లక్షలే ఇస్తాం: ఎన్హెచ్ఏఐ
భూసేకరణ చట్టం ప్రకారం పట్టణ ప్రాంతా ల్లో రిజిస్ట్రేషన్ ధరకు నాలుగు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు రెట్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నది. ఆ లెక్కన ట్రిపుల్ఆర్ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.6 లక్షల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఎన్హెచ్ఏఐ మాత్రం భూసేకరణ చట్టం ప్రకారం నిర్ణీత ధరే చెల్లిస్తామని స్పష్టం చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉదారంగా వ్యవహరించాలని ఎన్హెచ్ఏఐని కోరుతున్నది. దీంతో నష్టపరిహారం చెల్లింపు వ్యవహారం పీటముడిలా మారింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని భూములు బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.30-50 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.20 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీనికి ఎన్హెచ్ఏఐ ఒప్పుకోవడంలేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించినప్పటికీ సానుకూల ఫలితం రాలేదని సమాచారం. ఈ ప్రాజెక్టు మరికొంత కాలం పెండింగ్లో ఉండటం ఖాయంగా కనిపిస్తున్నది.
ట్రిపుల్ఆర్ ప్రాజెక్టు వివరాలు