RRR | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 22 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మెలికలు తిరుగుతూనే ఉన్నది. మ్యాపుల్లో లేకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ‘గుర్తులు’ వెలుస్తున్నాయి. తాజాగా చౌటుప్పల్ పరిధిలో నుంచి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం వరకు ఏకంగా 2-4 కిలోమీటర్ల మేర అలైన్మెంట్ బయటికి జరుగుతున్నట్టు తెలిసింది. కొన్నిరోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో కొత్త అలైన్‌మెంట్‌ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ ప్రజెంటేషన్‌లో చౌటుప్పల్ పరిధిలో పెద్దగా మార్పు కనిపించలేదు. కల్వకుర్తి నియోజకవర్గంతోపాటు చేవెళ్ల, వికారాబాద్ పరిధిల్లోనే భారీ ఎత్తున మార్పులు చేశారు. అయితే నాలుగైదు రోజులుగా చౌటుప్పల్ పరిధిలోనూ పాత అలైన్మెంట్లో మార్పుల దిశగా ముమ్మర సర్వే కొనసాగుతున్నట్టు తెలిసింది. ఈ మార్పు సీఎం రేవంత్ ఎదుట ప్రదర్శించిన పీపీటీలో లేదు. అంటే ప్రజెంటేషన్ తర్వాత కూడా మార్పుల ప్రక్రియ కొనసాగుతున్నట్టు స్పష్టమవుతున్నది.
మూడు రోజుల కిందట ప్రజల ముందే ట్రిపుల్ ఆర్ సర్వే జరిగిన దృశ్యాలు మీడియాలో కూడా వచ్చాయి. ముఖ్యంగా చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురం, జనగామ ఆపై పుట్టపాక అటునుంచి శివన్నగూడెం వరకు ఒక్కోచోట ఒకలా సగటున 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు అలైన్‌మెంట్‌ను బయటికి జరుపుతున్నట్టు తెలిసింది. ఆపై భట్లపల్లి వరకు యథావిధిగా కొనసాగించి తర్వాత సీఎం రేవంత్ ఎదుట ఇచ్చిన పీపీటీలోని కొత్త అలైన్‌మెంట్‌కు అనుసంధానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఎందుకు మార్పు చేస్తున్నారనేది ఆ ప్రాంత గ్రామాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధానంగా పొలాల్లో గుర్తులు పెడుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఉత్తర భాగం నుంచి వస్తున్న రింగ్‌రోడ్డు కొత్త అలైన్మెంట్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ప్రకారం.. చౌటుప్పల్ నుంచి శివన్నగూడెం వరకు రింగ్‌రోడ్డు లోపలికి జరిగినట్టుగా ఉండి ఆపై భారీ వంకర కనిపిస్తున్నదని, అందుకే రింగు మాదిరిగా వచ్చేందుకు చౌటుప్పల్ పరిధిలోనూ బయటకు జరుపుతున్నారని అధికారికవర్గాల సమాచారం. అంటే ప్రభుత్వ పెద్దల భూముల సమీపంలోకి రింగు రోడ్డును తీసుకుపోవడం వల్ల అసలు రింగురోడ్డు రూపం దెబ్బతిన్నందున ఈ సర్దుబాటు చేస్తున్నారా? లేక ఈ మార్పులోనూ కొందరు పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయా? అనేది తేలాల్సి ఉన్నది.
గత ఎన్నికల్లో రైతుల ఒత్తిడి మేరకు అలైన్మెంట్ మారుస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పిండ్రు. ఉన్న రోడ్లను పెంచుకుంటే సరిపోతుంది. కొత్త రోడ్లు ఎందుకని అన్నరు. అధికారుల మార్కింగ్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. సప్పిడోళ్లగూడెంలో మామిడి నర్సిరెడ్డికి భూమి పూర్తిగా పోవడంతో గుండె ఆగిపోయి చనిపోయిండు. ఇప్పటికైనా అధికారులు అలైన్మెంట్ మార్చాలి.
కొంతమంది స్వార్థం కోసమే అలైన్మెంట్ మారుస్తున్నరు. రెండోసారి మార్కింగ్సరికాదు. చౌటుప్పల్ రెవెన్యూ పరిధిలో గతంలో 4 గుంటల భూమి పోతే.. ఇప్పుడు 7 ఎకరాలు పోతున్నది. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నరు. లక్షల విలువైన ప్లాట్లు కోల్పోతున్నరు. ప్రస్తుతం జంక్షన్‌తో సర్వం కోల్పోతున్నరు. దీనికితోడు మున్సిపాలిటీ కూడా రెండు విభాగాలుగా వీడిపోతుంది.
అప్పో సప్పో చేసి లక్షలు పోసి ప్లాటు కొన్న. మొదటి అలైన్మెంట్ ప్రకారం చూస్తే ప్లాటుకు చాలా దూరం జంక్షన్‌కు అప్పట్లో అధికారులు మార్కింగ్ పెట్టిండ్రు. అదిచూసి కొన్న. తీరా ఇప్పుడు జంక్షన్ విస్తీర్ణం మారిందని నా ప్లాటులోనే మార్కింగ్ చేసిండ్రు. ఇప్పుడు ఏం చేయాల్నో తెలుస్తులేదు. నాతోపాటు పట్టణంలో 100కు పైగా ప్లాట్లు పోతున్నయి. అలైన్మెంట్ ముందుకు జరుపాలి. హెచ్ఎండీఎలో ప్లాటు కొంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తీసుకుంటే.. చివరికి ఇట్లా అయ్యింది.
మా నాన్న పేరు మీద 12 ఎకరాల భూమి ఉంది. మేము ముగ్గురం అన్నదమ్ముళం. వారసత్వంగా వచ్చిన ఈ భూమిని నమ్ముకొని వ్వసాయం చేసుకుంటూ బతుకుతున్నం. గతంలో 65వ జాతీయ రహదారి విస్తరణకు భూమిని కోల్పోయాం. తర్వాత పరిశ్రమల కరెంట్ కోసం, సోలార్ లైన్‌కు పెద్దపెద్ద స్తంభాలకు రెండోసారి ఇచ్చినం. మూడోసారి రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ నిర్మాణానికి ఉన్న మొత్తం భూమి పోతున్నది. ఉన్నా భూమి పోతే ఎలా బతుకాలి. ప్రభుత్వం ముందుకు జరిపి రోడ్డు వేయాలి.
మా 15 కుటుంబాలకు సంబంధించి 80 ఎకరాల భూమి ఉంది. తాతల నుంచి భూమిని నమ్ముకొని బతుకుతున్నం. మొదటి అలైన్మెంట్ ప్రకారం 15 ఎకరాలు మార్కింగ్ పెట్టిండ్రు. దీంతో ఇద్దరుముగ్గురికి పూర్తిగా నష్టం ఉండే. రెండోసారి అలైన్మెంట్ మార్చడంతో సుమారు 60 ఎకరాలు పోతున్నది. ఇప్పుడు అందరికీ పెద్ద నష్టమే జరుగుతున్నది. ఉన్న 20 ఎకరాలు కూడా కోసులు మిగులుతున్నది. అది కూడా దేనికి పనికి రాదు.
తొలుత 78 ఎకరాలు జంక్షన్‌కు ప్రతిపాదించారు. రెండోసారి డిజైన్ మార్చి 181 ఎకరాలు పెంచారు. కొంతమంది బహుళ అంతస్తుల హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, మల్టిప్లెక్స్‌లు, పార్కులు నిర్మిస్తరు అని చెబుతున్నరు. ఇవన్నీ ఎవరి కోసం ఆంధ్రోళ్ల కోసమా.. ఈ జాతీయ రహదారిపై తిరిగేది వాళ్లే. వాళ్ల వినోదం కోసమే దక్షణిభాగంపై ప్రభుత్వం ప్రేమ చూపిస్తున్నట్లు ఉంది.
నా చిన్న తనం నుంచి ఎవుసం చేసుకునే బతుకుంటున్నం. ఈ ఎవుసం తప్ప వేరే తెల్వదు. నా కున్న 4 ఎకరాల భూమిలో 15 గుంటలు మిగులుతుంది. అది కూడా వంకలు టింకలు ఉంటుంది. దేనికీ పనికి రాదు. ఏమి చేసి బతుకాలె. కొత్త ప్రభుత్వం వచ్చి మేలు చేస్తుంది అనుకుంటే. ఇట్లా జరిగే. ప్రభుత్వం తక్షణమే అలైన్మెంట్ మార్చాలి. లేదంటే మా బతుకులు రోడ్డున పడాల్సిందే.