జడ్చర్ల, ఫిబ్రవరి 19 : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని ఉదండాపూర్ భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ బండ్‌పై నిర్వాసితులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వాసితులు భిక్షాటన కోసం రోడ్డెక్కారు. సీఐ కమలాకర్, రూరల్ సీఐ నాగార్జునగౌడ్ జడ్చర్ల అతిథి గృహం వద్దకు చేరుకొని అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. న్యాయం కోసం ఆందోళన చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీ ఇవ్వడం లేదని రైతు మల్లయ్య మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే యత్నంచేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి డీఎస్పీ వెంకటేశ్వర్లుతో మాట్లాడించారు. గురువారం ఆర్డీవోను రిజర్వాయర్ వద్దకు తీసుకొచ్చి పరిహారం విషయంలో మాట్లాడిస్తామని నచ్చజెప్పి పంపించారు.