వరంగల్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కోయజాతి కొంగు బంగారమైన మేడారం మహాజాతర నిర్వహణ, ఆధునికీకరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఆదివాసీలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మేడారం పూజారులు, ఆదివాసీ సంఘాలు ఇచ్చిన ‘మాస్టర్’ స్ట్రోక్‌కు కాంగ్రెస్ సర్కార్ వణికిపోయింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం అయ్యే మేడారం జాతర నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై మేడారం పూజారులు, ఆదివాసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ప్రత్యేకించి గద్దెల కైవారం, ప్రాంగణంలో సర్కార్ తలపెట్టిన చర్యలపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. మేడారం మహాజాతర నిర్వహణ విషయంలో గత జూలై 3న మేడారం ప్రాంగణంలో దేవాదాయశాఖ నిర్వహించిన సమీక్ష సమావేశం నుంచి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండటం విశేషం. మేడారంలో ప్రస్తుతం ఉన్న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు వాటి కైవారం విషయంలో సర్కార్ అనాలోచితంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని మొదటి నుంచీ ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. మేడారం పూజారులు, ఆదివాసీ సంఘాలు ఆలోచనా ధోరణిని ‘నమస్తే తెలంగాణ’ ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే.
మేడారం మహాజాతర పనులను ఈనెల 13న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి సీతక్క మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రకటించారు. అయితే, మేడారం మాస్టర్ ప్లాన్, ప్రత్యేకించి గద్దెలు, పరిసర ప్రాంతాల నవీకరణపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మేడారం పూజారులు, తుడుందెబ్బ సహా పలు సంఘాలు, ఆదివాసీ విద్యార్థి సంఘాలతో సమావేశమయ్యారు. ములుగు కలెక్టర్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. గద్దెల ప్రాంగణం విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగించేందుకు.. ప్రభుత్వానికేం అభ్యంతరం లేదని, జాతర నిర్వహణ, నూతన నమూనాల ఖరారు అంశం మొత్తం ఆదివాసీ ప్రత్యేకించి కోయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటాయని ఆమె హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటి దాకా దేవాదాయశాఖ రూపొందించిన నమూనాలు ఉండవని, పూర్తిగా కోయ సంస్కృతి, జీవన విధానం ఉట్టిపడేలా పూర్తిగా కొత్త నమూనాను రూపొందించే క్రమంలో పూజారుల, ఆదివాసీ ప్రతినిధులు, మేధావుల అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటాయని ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న గద్దెల మూల స్వరూపాన్ని మార్చకుండానే, జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసమే వరుస గద్దెలు ఉంటాయని, ఆ మేరకు కొత్త డిజైన్ రూపొందిస్తామని పేర్కొన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. మొత్తానికి మేడారం పూజారులు, ఆదివాసీ సమాజం అభ్యంతరం, ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కార్ రెండు మూడు రోజుల్లో కొత్త డిజైన్‌తో వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.
మేడారంలో దేవాదాయశాఖ గత జూలై 3వ తేదీన నిర్వహించిన సమీక్ష సందర్భంగా మొదలైన రాద్ధాంతం కొనసాగుతూనే ఉన్నది. భక్తుల సౌకర్యం కోసం మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, ఊరట్టం తదితర గ్రామాల్లో సర్కార్ ఏర్పాట్లు, ఆయా ప్రాంతాల్లో చేపట్టే పనులపై ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల కైవారాన్ని మారుస్తూ దేవాదాయ శాఖ కొత్త నమూనాను రూపొందించింది. వలయాకారంలో రాతిపీఠం, శిలాస్తంభాలు అవీ కాకతీయ కీర్తితోరణాలను పోలి ఉండటంతో ఆదివాసీల్లో ముసలం పుట్టింది. సర్కార్ రూపొందించిన ఆ నమూనాతో అందరిలో అభ్యంతరం ఉన్నా ఎవరూ బయటకు చెప్పడానికి ముందుకురాని పరిస్థితిలో ‘మేడారంలో అపచారం!’, ఆధునికత పేరుతో సంస్కృతి విచ్ఛిన్నానికి సహించం’ అనే ప్రత్యేక కథనాన్ని జూలై 6వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించింది. ఆ తరువాత దేవాదాయ శాఖ మరో గద్దెల ప్రాంగణానికి మరో నమూనాను రూపొందించింది. సెప్టెంబర్ 3న గతంలో అభ్యంతరం తెలిపిన నమూనా స్థానంలో దేవాదాయ శాఖ కొత్త రూపాన్ని ఇచ్చింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను వరుస ఉండే విధంగా చూస్తూనే శిలా నమూనాలను రూపొందించింది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సహా ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో దీనిపై సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 4న ‘మేడారంలో మరో అపచారం!’ అంటూ మరో కథనాన్ని ప్రచురించింది. ఆ తరువాత సర్కార్ రూపొందించిన నమూనాలో సాంచీస్థూపం ఆనవాళ్లు ఉన్నాయని, అది తమ ఆచార సంప్రదాయాలకు విరుద్ధమని పూజారులు తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం సహా పలువురు మేధావులు ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న ‘మేడారంలో సాంచీ స్థూపం ఆనవాళ్లు?’ అనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.