Employee Transfers | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలపై సర్కారు నిషేధాన్ని ఎత్తేసి, సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నిచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంగళవారం జీవో 38ని జారీ చేసింది. ఒకే చోట నాలుగేండ్ల సర్వీసు పూరి ్తచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. ఏ క్యాడర్లోనైనా 40 శాతంలోపు ఉద్యోగులను మాత్రమే బదిలీ చేస్తారు. అంతకంటే ఎక్కువ మందిని బదిలీ చేయరు. మూడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు సైతం బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 మే 31లోపు ఉద్యోగ విరమణ పొందేవారిని బదిలీ నుంచి మినహాయింపునిచ్చారు. వీరు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంటే అవకాశం కల్పిస్తారు.
ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏటా చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 2024లో బదిలీలు చేపట్టగా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలో 2025లో బదిలీలు చేపట్టలేదు. ఏడాది తర్వాత మళ్లీ అవకాశం కల్పించారు. జనాభా గణన కోసం నియమించిన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. స్టేట్ క్యాడర్, మల్టీ జోన్, జోన్, జిల్లా క్యాడర్ ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు ముగ్గురితో కమిటీ ఏర్పాటవుతుంది. మొత్తం ప్రక్రియ మే 31లోపు పూర్తి కానుండగా, జూన్ 1 నుంచి బదిలీలపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. విద్యాశాఖ పరిధిలోని టీచర్లు, లెక్చరర్ల బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తాయి. పోలీస్ శాఖకు సైతం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని సర్కార్ స్పష్టం చేసింది.