ఖైరతాబాద్, సెప్టెంబర్ 2: కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో రూట్‌మ్యాప్ ప్రకటించాలని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తక్షణమే కులగణనకు చర్యలు చేపట్టాలని, లేకుంటే రాస్తా, రైల్‌రోకోలు, మంత్రుల నివాసాల ముట్టడితోపాటు హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని, రాష్ట్ర బంద్‌కు కూడా వెనుకాడమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలరాజు గౌడ్, వేముల వెంకటేశ్, మణిమంజరి, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షుడు నగేశ్, బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.