హిమాయత్‌నగర్, సెప్టెంబర్26: బీసీలకు రాజకీయ వాటా దక్కే వరకు సామాజిక ఉద్యమాన్ని కొనసాగిద్దామని వివిధ పక్షాల నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో గురువారం ‘బీసీ కులసంఘాల ఐక్యత’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం జాతీయ అధ్యక్షుడు బొల్ల శివశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమగ్ర కులగణన చేపడితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని వక్తలు స్పష్టం చేశారు. బీసీల్లో ఐక్యత కోసం పాటుపడాలని సూచించారు. రాష్ట్రంలోని బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి చట్టసభల్లో రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమించాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. బీసీల అభివృద్ధి జరిగినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు బీసీ సమాజాన్ని మేల్కొల్పాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. బీసీలు ఐక్యం కాకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బీసీ కులగణనతోపాటు చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను సాధించడమే తన జీవిత లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్‌రెడ్డే అవుతారని, 2028లో జరిగే ఎన్నికల్లో బీసీ సీఎం ఖావడం తథ్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పునరుద్ఘాటించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి కోరారు. సమావేశంలో మేధావులు, బీసీ నేతలు బీఎస్ రాములు, గడ్డం జగన్నాథం, అవ్వారి భాస్కర్, వనం దుశ్యంతల, గుజ్జ కృష్ణ, గుంటక రూపా, గుజ్జ సత్యం, బొమ్మ ప్రవళిక, రాకేశ్, బొమ్మ అమరేందర్, బిల్లా దీపిక, గుర్రం శ్రవణ్, వేముల రామకృష్ణ, ఎం భాగ్యలక్ష్మి, కేపీ మురళీకృష్ణ, అనురాధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.