హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ‘మగ్ధూంభవన్’లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ అధ్యక్షతన తాగు, సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని యుద్ధప్రాతిపదికన పరిషరించాలని ఈ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రిటైర్డ్ ఇంజనీర్ కే విఠల్‌రావు, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సాగునీటి విశ్లేషకులు సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేసి 54 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే కేటాయించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లో పియర్స్ కుంగిపోవడానికి కారణాలను తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలతోపాటు ఇతర పరీక్షలు నిర్వహించాలని, ఆ పరీక్షల్లో తేలిన అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఎన్డీఎస్ఏ చేసిన సూచనల మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రకటించాలని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొన్నట్టుగా తకువ ఖర్చుతో గోదావరి జలాలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 637 ఎత్తిపోతల పథకాల్లో ప్రస్తుతం 385 మాత్రమే పనిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలోని నెల్లికల్లు, కేశవాపురం, నిర్మల్ జిల్లాలోని పిప్రీలో కొత్తగా మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాలతోపాటు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 37 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు అవసరమైనంత బడ్జెట్ కేటాయించాలని, నిర్దేశిత గడువులోగా వాటిని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.