హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రముఖ సెఫాలజిస్టులు తేల్చి చెప్పారు. ఇప్పటికీ తెలంగాణలో సీఎం కేసీఆరే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీతో మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ మెజార్టీకి దరిదాపుల్లోకి రావని స్పష్టం చేశారు.
దక్షిణాది రాష్ర్టాల్లో రాజకీయ పరిస్థితులపై ‘ఇన్స్టిట్యూట్ ఫర్ గవర్నెన్స్, పాలసీస్ అండ్ పాలిటిక్స్’ (ఐజీపీపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో రౌంట్‌టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే ఎజెండాగా ‘పాలిటిక్స్ ఇన్ సౌత్ ఆఫ్ వింధ్యాస్’ పేరుతో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) నుంచి ప్రొఫెసర్ సంజయ్‌కుమార్, యాక్సిస్ మై ఇండియా సీఎండీ ప్రదీప్ గుప్తా, సీ-ఓటర్ డైరెక్టర్ యశ్వంత్ దేశ్‌ముఖ్, ది హిందూ పత్రిక ఢిల్లీ రెసిడెంట్ ఎడిటర్ వర్గీస్ కే జార్జ్, తెలంగాణ రెసిడెంట్ ఎడిటర్ రవిరెడ్డి, ఢిల్లీ జేఎన్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్ అజయ్ గుధవర్తి, సీనియర్ జర్నలిస్టు పర్సా వెంకటేశ్వర్రావు, ఢిల్లీకి చెందిన పీఎం మ్యూజియం అండ్ లేబొరేటరీకి చెందిన డాక్టర్ సజ్జన్ కుమార్ పాల్గొన్నారు. ఐజీపీపీ డైరెక్టర్ మనీశ్ తివారీ ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ముక్తకంఠంతో చెప్పారు. గతంతో పోల్చితే కాంగ్రెస్‌కు కాస్త హైప్ కనిపిస్తున్నా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిపారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు ఓట్ల తేడా 18 శాతం ఉన్నదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణ, కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో 18 శాతం లోటును కాంగ్రెస్ దాటడం అత్యంత కష్టమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో అత్యంత సానుకూలత ఉన్నదని వెల్లడించారు. పదేండ్లపాటు కొనసాగిన ప్రభుత్వాలపై కొంత అసంతృప్తి ఉండటం సహజమని, తెలంగాణలో అది తక్కువగా కనిపిస్తున్నదని తెలిపారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ కూడగట్టడం కూడా కష్టమని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోతుందని, ఇది బీఆర్ఎస్కు మరింత మెజార్టీ రావడానికి ఉపకరిస్తుందని విశ్లేషించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో, దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ర్టాలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐజీపీపీ ‘సౌత్ ఆఫ్ వింధ్యాస్’ పేరుతో దక్షిణాది రాష్ర్టాల్లో రాజకీయ పరిస్థితులపై వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నది. ప్రముఖ సెఫాలజిస్టులు, రాజకీయ విశ్లేషకులు, స్కాలర్లు, జర్నలిస్టులు, విదేశీ రాయబారులు, దేశ విదేశీ ప్రతినిధులు, తదితరులను భాగస్వాములను చేస్తున్నది. అధికార పార్టీల పనితీరు, ప్రతిపక్షాల తీరు, ఆయా రాష్ర్టాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తున్నది.
అనుమానం అవసరమే లేదు
తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పదేండ్లుగా అధికారంలో ఉన్నది. అంతమాత్రాన ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉండాలని లేదు. దేశ చరిత్రను పరిశీలిస్తే అనేక మంది ముఖ్యమంత్రులు రెండుమూడుసార్లు, అంతకన్నా ఎక్కువగా వరుసగా ప్రభుత్వాలను నడిపిన చరిత్ర ఉన్నది. తెలంగాణలోనూ ఇదే పునరావృతం కానున్నది. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు.
– సంజయ్ కుమార్, సీఎస్డీఎస్, ఢిల్లీ
ప్రచారంలోనూ బీఆర్ఎస్దే ముందంజ
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 46 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్‌కు 28 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే తేడా 18 శాతం ఉన్నది. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఐదేండ్లలోనే 18 శాతం ఓట్ల లోటును దాటి, అధికారంలోకి రాలేదు. పైగా బీఆర్ఎస్కు ఓట్ల శాతం తగ్గే అవకాశం కనిపించడం లేదు. గతంతో పోల్చితే ప్రచారం పరంగా కాంగ్రెస్ కాస్త మెరుగ్గా కనిపిస్తున్నా, బీఆర్ఎస్ పార్టీయే అందరికన్నా ముందున్నది.
– ప్రదీప్ గుప్తా, సీఎండీ, యాక్సిస్ మై ఇండియా
బీఆర్ఎస్కు అదే బలం
తెలంగాణ రాష్ట్రం పాలనా సంబంధ సమస్యలు, ఉనికి సమస్యలు, సంక్షేమ రంగ సమస్యలతో ప్రస్థానం మొదలు పెట్టి ఈ స్థాయికి చేరింది. ఇదే బీఆర్ఎస్కు బలం. తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారో చెప్పుకోవడం ద్వారా 2018లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈసారి అదే జరుగనున్నది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపుకు తిప్పుకోవడంలో విఫలం అవుతున్నారు.
– యశ్వంత్ దేశ్ ముఖ్, డైరెక్టర్, సీ-వోటర్
బీజేపీ ఎజెండా పనిచేయదు
తెలంగాణలో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు సీఎం కేసీఆరే. ప్రజలు ఇప్పటికీ ‘మనవాడు’ అనే భావన ఉన్నది. ఇదే సమయంలో బీజేపీ ఓబీసీ ఓటర్లకు గాలం వేయడంపైనే దృష్టి పెట్టింది. ఈ ఎజెండా సార్వత్రిక ఎన్నికల్లో పనిచేస్తుందేమోగానీ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఫలితం ఇవ్వదు.
– పర్సా వెంకటేశ్వర్రావు, సీనియర్ జర్నలిస్టు
హైదరాబాద్‌దే కీలకపాత్ర
రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలంటే హైదరాబాద్ అత్యంత కీలకం. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలంగా ఉన్నది, ఏ పార్టీ అధికంగా సీట్లు గెలుచుకుంటుంది అనేది ముఖ్యం.
– రవిరెడ్డి, ది హిందూ తెలంగాణ రెసిడెంట్ ఎడిటర్