(నాగర్ కర్నూల్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)
నాగర్‌కర్నూల్‌లో గులాబీ జనజాతర. 100 ఎకరాల సువిశాల స్థలంలో ఎటుచూస్తే అటు జనంతో కిక్కిరిసిపోయింది. బతుకమ్మలు, బోనాలతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. మంగళవారం నాగర్‌కర్నూల్ నూతన జిల్లా సమీకృత కలెక్టరేట్, జిల్లా నూతన ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షలాదిగా తరలివచ్చిన జనప్రభంజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పాలమూరు మార్పు వెనుక కేసీఆర్ పడిన తపన ఎంతో ఇక్కడి ప్రజలకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అందుకేనేమో మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రజలు భారీగా తరలివచ్చారు. కేసీఆర్ పట్ల ప్రజల గుండెల్లో దాగిన అభిమానాన్ని నాగర్‌కర్నూల్ బహిరంగ సభ మరోసారి చాటిచెప్పింది.
పోటెత్తిన జనం
నాగర్‌కర్నూల్ సమీకృత కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణమే కాకుండా పట్టణం మొత్తం గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్ బహిరంగసభకు సాయంత్రం 6 గంటలకు చేరుకుంటారని పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. దీంతో 5.30 నుంచి 6 గంటల మధ్య సభా ప్రాంగణానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో సభా ప్రాంగణం అంతా ఇసుకవేస్తే రాలని విధంగా కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణం అంతా ఈలలు, కేరింతలు, నృత్యాలతో మార్మోగిపోయింది.
కేసీఆర్ పేల్చిన నవ్వుల తూటాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించారు. ఆయన ప్రసం గం ఆసాంతం ప్రజలు శ్రద్ధగా విన్నారు. పాలమూరుతో తనకున్న అనుబంధాన్ని, ఉద్యమానుభవాన్ని సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ఆవిష్కరించారు. ‘దుందుభివాగు మీద గోరటి వెంకన్న పాట రాసిండు. నాకు ఆయినలెక్క పాడరాదు కానీ..’ అని సీఎం కేసీఆర్ అనగానే నవ్వులు విరబూశాయి. నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రస్తావన వచ్చినపుడు ‘తుపాకీ గుండు జనార్దన్‌రెడ్డి’ అని సీఎం కేసీఆర్ పేర్కొనటంతో పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ బహిరంగ సభ జోష్‌ను నింపింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14కు 14 సీట్లు బీఆర్ఎస్వేనని విశ్వాసాన్ని సభ కల్పించింది.
దేశానికి సీఎం కేసీఆర్ అవసరం ఉన్నది : మర్రి జనార్దన్‌రెడ్డి
తెలంగాణలోని సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో మంచి స్థానానికి చేరుకోవాల్సిన అవసరం ఉన్నదని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఇతర రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నారని చెప్పారు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ అవసరం ఉన్నదని చెప్పారు.