ఒక రైతు ఏదైనా అవసరానికి తన భూమిని అమ్ముకోవాలంటే సులభంగా పని జరిగిపోతున్నది. మీ సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకొని, నిర్ణీత సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అరగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నది. అధికారులను బతిమిలాడాల్సిన పనిలేదు. ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు.
కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్మాలన్నా, కొనాలన్నా సర్వే తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. ఒక రైతు తన భూమిని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి. సర్వేయర్ వచ్చి, భూమిని కొలిచి హద్దులతో డిజిటల్ మ్యాపులను రైతుకు ఇవ్వాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకొని, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘భూ భారతి’ చట్టం రైతుల పాలిట పిడుగుగా మారనున్నది. భూమి క్రయవిక్రయాలు జరపాలంటే సర్వే తప్పనిసరిగా చేయించాలని చట్టంలో నిబంధన విధించింది. దీంతో ఒక రైతు తన పొలాన్ని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్నది. రెండుమూడు మండలాలకు కలిపి ఒక సర్వేయర్ చొప్పున కొనసాగుతున్నారు. ఒక్కో సర్వేయర్ వద్ద పదుల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వే కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేస్తే కనీసం మూడునాలుగు వారాల తర్వాతే సర్వే చేస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రైతు ఏదైనా అత్యవసరంగా తన పొలాన్ని అమ్మడం సాధ్యమేనా? అనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 612 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం మండలానికి ఒక సర్వేయర్‌ను కేటాయించింది.
ప్రస్తుతం పనిచేస్తున్నారు. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గణాంకాలను బట్టి ఒక్కో మండలంలో రోజుకు 5-10 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని మండల్లాలో ఈ సంఖ్య 20-30 వరకు ఉంటున్నాయి. ఒక్క సర్వేయర్ రోజుకు ఇన్ని భూముల సర్వే నిర్వహించగలరా? అన్నది ప్రభుత్వమే తేల్చా ల్సి ఉన్నది. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి వెయ్యి మందిని సర్వేయర్లుగా నియమిస్తామని ప్రభు త్వం చెప్తున్నది. ఇప్పటికే వారి నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నది. అయితే వీరు సైతం అందుబాటులోకి వచ్చినా మండలానికి ఇద్దరు సర్వేయర్లు మాత్రమే ఉంటారు. అయితే ఒక సర్వేయర్ రోజుకు సగటున ఒకటి రెండు భూముల సర్వే మాత్రమే చేయగలుగుతారని చెప్తున్నారు. ఈ లెక్కన రోజువారీ డిమాండ్‌ను తట్టుకోవడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు.
ఇప్పటికే రైతులు తమ భూమి సర్వే చేయించుకునేందుకు సర్వేయర్లను బతిమాలాల్సి వస్తున్నది. పై అధికారులను కలిసి పైరవీలు చేయించాల్సి వస్తున్నది. పైగా, కొలతలు వేసిన తర్వాత కచ్చితంగా ఎంతోకొంత ముట్టజెప్పాల్సిందేనని రైతులు చెప్తున్నారు. కొత్త నిబంధనతో రైతుల అవసరాన్ని బట్టి ‘వసూలు’ చేసే మొత్తం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం అవుతున్నది. అవినీతికి ఆజ్యంపోసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మండలాల్లో లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నా వారిని రైతులు పెద్దగా నమ్మడం లేదు. దీంతో ప్రభుత్వ సర్వేయర్లకే డిమాండ్ కొనసాగనున్నది. ఇలా కొత్త నిబంధనతో రైతులు అత్యవసరంగా భూమిని అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతోపాటు రోజులపాటు ఎదురుచూసే అవస్థ తప్పదని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం భూ విస్తీర్ణానికి సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, వాస్తవ విస్తీర్ణానికి మధ్య అనేక వ్యత్యాసాలు ఉ న్నాయి. ఒక రైతు తన పొలాన్ని సర్వే చేయించే సమయంలో భూమి ఎక్కువగా వచ్చినా, తక్కువగా వచ్చి నా.. దానిని ఏం చేస్తారనే దానిపై చట్టంలో స్పష్టత లేదు. ఉదాహరణకు ఒక రైతు రికార్డులో రెండున్నర ఎకరాలు ఉండి, వాస్తవంగా రెండు ఎకరాలు మాత్ర మే ఉంటే.. ఆ రైతు రెండు ఎకరాలను ఇతరులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేస్తే, మిగతా అర ఎకరాన్ని ఏం చేస్తారనేది ప్రశ్నగా మారింది. ప్రభుత్వ భూములు, పట్టాలపై ఏం చేస్తారనేది స్పష్టత లేకుండా పోయింది.
రాష్ట్ర ప్రభుత్వం పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను సర్వేయర్లుగా నియమించాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే ఆప్షన్లు తీసుకుంటున్నది. ఈ నెల 28లోగా తమ అభిప్రాయాలు తెలపాలని ఆదేశాలు జారీచేసింది. సర్వీస్ నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో వారు వెనుకంజ వేస్తున్నారు. నేరుగా సర్వేయర్లుగా నియమిస్తారా? లేదా రెవెన్యూ శాఖలో వీఆర్వో గా నియమించి డిప్యూటేషన్ ఇస్తారా? అన్నది స్పష్టతలేదు. ఒకవేళ సర్వేయర్లుగా నియమించాల్సి వస్తే, ఉద్యోగార్హతల విషయంలో వచ్చే సాంకేతిక సమస్యలపై ఏం చేస్తారనే స్పష్టత కూడా లేదు. మరోవైపు రెండు మూడేండ్లుగా వారు వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సర్వేయర్లుగా వస్తే ఆ సర్వీస్‌ను కొనసాగిస్తారా? లేదా మళ్లీ మొదటి నుంచీ ప్రారంభించాల్సి వస్తుందా? అని సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఎదురుచూసిన తర్వాతే ఆప్షన్లు ఇవాలని భావిస్తున్నట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.