హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా ప్రతీశాఖలో నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. అయితే ప్రతీ వేసవికాలంలో తరచూ అగ్ని ప్రమాదాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. కొన్ని సమయాల్లో అగ్ని ప్రమాద తీవ్రత వల్ల అక్కడకు ఫైర్ సిబ్బంది వెళ్లలేకపోవడంతో నష్టం తీవ్రత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టిసారించిన తెలంగాణ అగ్నిమాపక, విపత్తు నిర్వహణశాఖ.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వినియోగిస్తున్న 3 ఫైర్ ఫైటింగ్ రోబోలను సుమారు రూ.6 కోట్లతో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది.
ఈ రోబోలను ఒక్కసారి చార్జ్ చేస్తే.. సుమారు 6 గంటలు నాన్‌స్టాప్‌గా ఫైర్ ఫైటింగ్ చేస్తాయి. అంతేకాకుండా సుమారు 900 డిగ్రీల వేడిలో కూడా ఇవి తమకు తాము నీటిని స్ప్రే చేసుకుంటూ మంటలను ఆర్పుతాయి. ముఖ్యంగా ఫైర్‌ఫైటర్స్ వెళ్లలేని ప్రాంతాలు, ఎత్తైన భవనాలు, పరిశ్రమల్లో సైతం ఇవి ఫైర్ ఫైటింగ్ చేస్తాయి. కాగా, వీటిని ఎలా ఆపరేట్ చేయాలనే అంశంపై కంపెనీ ప్రతినిధులతో అగ్నిమాపక సిబ్బందికి శిక్షణ ఇప్పించిన అనంతరం వాటిని హైదరాబాద్, రంగారెడ్డి, పటాన్చెరు వంటి అగ్నిమాపక కేంద్రాలకు పంపనున్నారు.
ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫైర్ స్టేషన్లు, మరికొన్ని పాత ఫైర్స్టేషన్ల కోసం కొత్తగా 18 ఫైర్ టెండర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇవి ఫిట్టింగ్ దశలో ఉన్నాయి. అవి పూర్తయితే మేడ్చల్ -మలాజిగిరి, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, రాజేంద్రనగర్, షాద్‌నగర్, అలంపూర్, మక్తల్, స్టేషన్ ఘన్పూర్, నర్సాపూర్, హుస్నాబాద్, డోర్నకల్, కల్వకుర్తి, పినపాక, బాలొండ, ధర్మపురి, నందిపేటలకు పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వీటితోపాటు నగర వీధుల్లో సులువుగా భవనాల వద్దకు వెళ్లగలిగే మినీఫైర్ వాహనాలు, మల్టీ ఆర్టిక్యులేటెడ్ వాటర్ టవర్‌ను సుమారు రూ.6 కోట్లతో కొనుగోలు చేశారు. దీంతో నగరంలో ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం జరిగినా.. వీటి ద్వారా నియంత్రించగలమని అధికారులు చెప్తుతున్నారు.
విపత్తులు సంభవించినప్పుడు పౌరుల ప్రాణాలు, ఆస్తులను కాపాడటం కోసం రాష్ట్ర అగ్నిమాపకశాఖ అహర్నిశలు కృషి చేస్తున్నది. నిరుడుతో పోల్చితే అగ్నిప్రమాదాలు పెరుగుతున్నందున ఈ వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇండ్లలో ప్రమాదవశాత్తూ సంభవించే అగ్నిని ఆర్పడంపై అవగాహన పెంచుకోవాలి. ఈ ‘ఫైర్వీక్’ అగ్నిమాపక సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిర్లక్ష్యంగా సిగరెట్ కాల్చి పడేస్తుండటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫైర్ సిబ్బందికి మంటలు అదుపు చేయడంలోనే మాత్రమే కాకుండా ఇతర రెస్క్యూ అంశాల్లోనే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం.
– వై నాగిరెడ్డి, అగ్నిమాపకశాఖ డీజీ