హైదరాబాద్: హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల ఇండ్లకు కన్నం వేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ ఇండ్లల్లో చోరీ ఘటనలు మరువకముందే మరో మాజీ మంత్రి నివాసంలో దొంగలు పడ్డారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని పొన్నాల ఇంట్లో రూ.1.5 లక్షల నగదుతోపాటు భారీగా బంగారు అభరణాలను దుండగులు చోరీ చేశారు. దీంతో ఆయన సతీమణి అరుణా దేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గతేడాది నవంబర్‌లో మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిశ్రీధర్ బాబు ఉంటున్నారు. దీపావళి రోజున సెల్‌ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో కూడా చోరీ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత భట్టి విక్రమార్క కుటుంబం ప్రజాభవన్‌కు మారిన విషయం తెలిసిందే. దీంతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఆయన ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంటి బాగోగులు చూసేందుకు రోషన్ మండల్ అనే వ్యక్తిని వాచ్‌మన్‌గా నియమించారు. ఈనెల 21న వాచ్‌మన్‌కు డిప్యూటీ సీఎం పీఎస్వో భాస్కర్‌శర్మ ఫోన్ చేయగా కలవలేదు. అనుమానంతో కార్యాలయ సిబ్బందిని ఇంటికి పంపించగా రోషన్ కనిపించలేదు. దీంతో ఇంటిలోపల పరిశీలించగా బెడ్ రూం తలుపులు పగులగొట్టి ఉన్నాయి. కప్‌బోర్డులో ఉండే రూ.80 వేలు విలువ చేసే వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. ఇక కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు.