హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మెరుగైన రోడ్ల ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పదేపదే చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు.. ఆచరణలో పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకొచ్చిన రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేసిన కొత్తరోడ్లు కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే. కొత్తగా 1800 కి.మీ.ల రోడ్లకు మంజూరీలు ఇవ్వగా, అందులో 3.3% పనులే పూర్తయ్యాయి. మరోవైపు 2047 నాటికి ప్రస్తుతమున్న రోడ్ నెట్‌వర్క్‌కు 20వేల కిలోమీటర్లమేర అదనంగా రోడ్లు ఏర్పాటుచేస్తామని విజన్ డాక్యుమెంట్లో సర్కారు ప్రకటించింది. గత రెండేండ్లలో రూ.6, 445 కోట్లతో 1806 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి మంజూరీ ఇవ్వగా ఇప్పటివరకు కేవలం రూ.90 కోట్లతో 60 కి.మీ.ల పనులు మాత్రమే పూర్తిచేశారు. నెలకు సగటున రెండున్నర కిలోమీటర్లు మాత్రమే రోడ్లు నిర్మించారు. ఇంకా రూ.2,170 కోట్ల పనులకు టెండర్లు పిలవాల్సివుండగా, మరో 450 కి.మీ.ల పనులకు టెండర్లు పిలిచినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు.
రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో ఒకేసారి దాదాపు రూ.60 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు గత నెలలో ప్రకటించారు. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని రూ.10,400 కోట్లతో 8 లేన్ల రహదారిగా విస్తరించనున్నట్టు తెలిపారు. ఆరు లేన్లతో నిర్మించనున్న రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ ఆర్)కు రూ.36,000 కోట్లు కేటాయించినట్టు, హ్యామ్ ప్రాజెక్టులో భాగంగా రూ.11,399 కోట్లతో రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డు ఉన్నచోట డబుల్రోడ్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఇవి కాకుండా.. మరో రూ.28 వేల కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తుదిదశలో ఉన్నాయని, ఇందులో రూ.8,000 కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌తోపాటు రూ.20వేల కోట్ల తో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టు ఉన్నట్టు చెప్పారు. తాజాగా గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వం విడుదలచేసిన రోడ్ల శాఖ విజన్ డాక్యుమెంట్లో ఘనంగా లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ప్రస్తుతమున్న 34,058 కి.మీ.ల రోడ్లను వచ్చే పదేండ్లలో 53,102 కి.మీ.లకు పెంచనున్నట్టు విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వం ప్రకటించింది. లక్ష్యాలు నిర్దేశించుకోవడం మంచిదే అయినా.. అమల్లో చిత్తశుద్ధే ఫలితాలను నిర్దేశిస్తుంది.
