హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): బిడ్డను కోల్పోయిన ఆ తల్లి రోదనలు మీకు (మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క) వినపడలేదా? కనపడలేదా? ములుగు రోడ్‌షోలో పాల్గొన్న మీరు మీ మూలాలనే మరిచారా? అని ఆ మంత్రులపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. తమ మూలాలను గిరిజన బిడ్డలు మళ్లీ గుర్తుచేయాలి అని పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవమాసాలు మోసిన కన్నబిడ్డ కళ్లు కూడా తెరవకముందే నిండునూరేండ్లు నిండితే.. ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లిందో? ఆమె ఎంత మానసిక క్షోభకు గురైనదో? అన్న బాధ వర్ణణాతీతమని పేర్కొన్నారు. ఆ బాధ అక్షరాల్లో రాయలేనిదని, మాటల్లో వర్ణించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆ పసికందు ప్రాణం పోయిందని తెలిసినా, మానవత్వం లేకుండా రోడ్‌షో చేస్తూ, చిరునవ్వులు చిందిస్తున్న ఆ ఇద్దరు మంత్రుల తీరుతో వారి నిజస్వరూపం తేటతెల్లమైందని చెప్పారు. ప్రజల పట్ల వారికున్న అంకితభావం ఏపాటిదో తేటతెల్లమైందని మండిపడ్డారు. బిడ్డను కోల్పోయిన తల్లికి అభయం ఇవ్వని మీ అభివాదం ఎందుకు? అని నిలదీశారు. తమరు ములుగులో చేసింది రోడ్ షో కాదని, రోదన షో అని, ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారి శవయాత్ర అని అభివర్ణించారు.
మంత్రులుగా కాకుండా, కనీసం మనుషులుగానైనా మానవత్వంతో స్పందించి, అక్కడికక్కడే విచారణ చేపట్టి ఉండాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డారు. పరిహారం సంగతి దేవుడెరుగు, కానీ ఆ బిడ్డను కోల్పోయిన తల్లిని పరామర్శించే తీరిక కూడా తమరికి లేదా? అని నిలదీశారు. తక్షణమే ములుగు ఏరియా దవాఖానలో జరిగిన అమానవీయ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బిడ్డను కోల్పోయిన ఆ తల్లికి మెరుగైన వైద్యం అందించాలని, వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ములుగు, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ములుగు ప్రభుత్వ దవాఖానలో పసికందు మృతి ఘటన నేపథ్యంలో కలెక్టర్ టీఎస్ దివాకర నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేశారు. చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, డీఎంహెచ్‌వో గోపాల్‌రావు, వైద్యాధికారులు రణధీర్, సుధాకర్, జగదీశ్వర్, పద్మజ, భారతి, ప్రసాద్, డీడబ్ల్యూవో శిరీషతో పాటు హెడ్ నర్సు పద్మను నియమించారు. శనివారం అదనపు కలెక్టర్ మహేందర్‌జీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ విచారణ జరిపింది. బండారుపల్లికి చెందిన రవళి దవాఖానలో అడ్మిట్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు నమోదు చేసిన కేషీట్లను పరిశీలించి ఘటనపై చర్చించారు.