హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాలపై ఆర్టీఏ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాల్సిన అవసరముందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ సభ్యుల రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నాన్ అఫీషియల్ సభ్యులు (ఆర్టీఏ ఏజెంట్స్)కు బుధవారం హైదరాబాద్లో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. డిసెంబర్లో నిర్వహించే రోడ్డు భద్రతా మాసోత్సవంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల కర్నూల్, చేవెళ్ల బస్సు ప్రమాదాలు జరిగిన తీరును ఆయన గుర్తుచేశారు. రోడ్డు భద్రతపై విద్యార్థులకు పాఠశాలలు, కళాశాల స్థాయిల్లో పోటీలు నిర్వహించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్రప్రభుత్వం రూ.1.5లక్ష వరకు అందిస్తున్న ఉచిత చికిత్సపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.